“ఈ ప్రపంచంలో నీవు నాకు అప్పగించిన వాళ్ళకు నిన్ను గురించి తెలియ చేసాను. వాళ్ళు నీ వాళ్ళు. కాని వాళ్ళను నీవు నాకు అప్పగించావు. వాళ్ళు నీ సందేశాన్ని పాటించారు.
ఎందుకంటే, నీవు నాకు చెప్పిన సందేశాన్ని వాళ్ళకు చెప్పాను. వాళ్ళు దాన్ని అంగీకరించారు. నేను నిజంగా నీ నుండి వచ్చానని వాళ్ళకు తెలుసు. నీవు నన్ను పంపావన్న విశ్వాసం యిప్పుడు వాళ్ళలో కలిగింది.
“నేనీ ప్రపంచంలో యిక ఉండను. కాని వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. నేను నీ దగ్గరకు రాబోతున్నాను. ఓ తండ్రీ! నీలో పవిత్రత ఉంది. నీవు నాకిచ్చిన, నీ నామంలో ఉన్న మహిమతో వాళ్ళను రక్షించు. అలా చేస్తే మనం ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉంటారు.
నేను వాళ్ళతో ఉన్నప్పుడు, నీవు నా కిచ్చిన నామంతో వాళ్ళను రక్షించి కాపాడాను. లేఖనాల్లో వ్రాసినవి నిజం కావటానికి నాశనం కావలసిన వాడు తప్ప మరెవ్వరూ నాశనం కాలేదు.
నీ సందేశం నా శిష్యులకు చెప్పాను. నేను ఈ ప్రపంచానికి చెందిన వాణ్ణి కాదు. అదే విధంగా నా శిష్యులు కూడా ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు. కనుక ప్రపంచం వాళ్ళను ద్వేషిస్తుంది.
తండ్రీ! నేను నీలో, నీవు నాలో ఉన్నట్లే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను పంపినట్లు ఈ ప్రపంచం నమ్మాలంటే వాళ్ళను కూడా మనలో ఐక్యం చేయుము.
నేను వాళ్ళలో ఉన్నాను. నీవు నాలో ఉన్నావు. వాళ్ళలో సంపూర్ణమైన ఐక్యత కలిగేటట్లు చేయుము. అలా చేస్తే నీవు నన్ను పంపావని, నన్ను ప్రేమించినంతగా వాళ్ళను కూడా ప్రేమించావని ప్రపంచానికి తెలుస్తుంది.
“తండ్రీ! నీవు నాకు అప్పగించిన వాళ్ళు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం పుట్టక ముందు నుండి నన్ను ప్రేమించావు. నాకు మహిమను ఇచ్చావు. ఆ మహిమను వాళ్ళు చూడాలని నా అభిలాష.