ఎలీహు అనే పేరు గల ఒకతను అక్కడ ఉన్నాడు. ఎలీహు బరకెయేలు కుమారుడు. బరకెయేలు బూజు సంతతి వాడు. ఎలీహు రాము వంశస్థుడు. ఎలీహు యోబు మీద చాలా కోపగించాడు. ఎందుకంటే యోబు తన మట్టుకుతానే మంచివాడినని చెప్పు కొంటున్నాడు. మరియు యోబు తాను దేవునికంటే నీతిమంతుణ్ణి అని చెబుతున్నాడు.
కాబట్టి ఎలీహు యోబు స్నేహితుల మీద కూడా కోపగించాడు. ఎందు కంటే యోబు స్నేహితులు ముగ్గురూ యోబు ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక యోబుదే తప్పు అని రుజువు చేయలేకపోయారు.
అక్కడ ఉన్న వారిలో ఎలీహు చాలా చిన్నవాడు. కనుక ప్రతి ఒక్కరూ మాట్లాడటం అయ్యేంత వరకు అతడు వేచి ఉన్నాడు. అప్పుడు అతడు మాట్లాడటం ప్రారంభించవచ్చు అనుకొన్నాడు.
కనుక ఎలీహు మాట్లాడటం ప్రారంభించాడు. అతడు ఇలా అన్నాడు: “నేను చిన్నవాడిని. మీరు పెద్దవాళ్లు. అందుకే నేను అనుకొంటున్నది ఏమిటో మీతో చెప్పాడానికి భయపడుతున్నాను.
మీరు తెలివిగల మాటలతో యోబుకు జవాబు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నంతసేపూ నేను శ్రద్ధగా విన్నాను. కాని యోబుదే తప్పు అని మీరు ముగ్గురూ రుజువు చేయలేదు. యోబు వాదాలకు మీలో ఒక్కరూ జవాబు చెప్పలేదు.