యూదా రాజ్యాన్ని యెహోయాకీము పాలిస్తున్న మొదటి సంవత్సరంలో [*మొదటి సంవత్సరం క్రీ. పూ. 609వ సంవత్సరం.] ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు.
యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు దేవాలయ ప్రాంగణంలో నిలబడు. దేవుని ఆరాధించుటకై వచ్చే యూదా ప్రజలందరికి ఈ సందేశాన్ని అందజేయుము. నేను నిన్ను మాట్లాడమని చెప్పినదంతా వారికి చెప్పుము. నా సందేశంలో ఏ భాగాన్ని వదిలి పెట్టవద్దు.
బహుశః వారు నా సందేశాన్ని విని ఆచరించవచ్చు. బహుశః వారా దుర్మార్గపు జీవితాన్ని విడనాడవచ్చు. వారు గనుక మారితే, నేను వారిని శిక్షించాలనే నా పథకాన్ని కూడా మార్చు కుంటాను. వారు చేసిన అనేక దుష్టకార్యాల దృష్ట్యా నేను వారిని శిక్షించే పథకాన్ని తయారు చేస్తున్నాను.
మీరు నన్ను అనుసరించక పోతే యెరూషలేములో ఉన్న నా ఆలయాన్ని షిలోహులో వున్న నా పవిత్ర గుడారం [†నా ఆలయాన్ని … గుడారం షిలోహులో వున్న పవిత్ర స్థలం బహుశః సమూయేలు కాలంలో నాశనం చేయబడి వుండవచ్చు. చూడండి, యిర్మీయా 7 మరియు సమూయేలు మొదటి గ్రంథం 4.] మాదిరిగా చేసివేస్తాను. ప్రపంచంలోని ప్రజలెవరైనా తమకు గిట్టని నగరాలకు కీడు జరగాలని తలిస్తే, యెరూషలేముకు జరిగినట్లు జరగాలని కోరుకుంటాను.’ ”
ప్రజలకు చెప్పమని యెహోవా ఆజ్ఞ యిచ్చినదంతా యిర్మీయా చెప్పటం ముగించాడు. పిమ్మట యాజకులు, ప్రవక్తలు, ప్రజలు అంతా యిర్మీయాను పట్టు కున్నారు. “ఈ భయంకరమైన విషయాలు చెప్పి నందుకు నీవు చనిపోవలసినదే!
యెహవా పేర అటువంటి విషయాలు చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! షిలోహులోని పవిత్ర గుడారంలా ఈ దేవాలయం నాశనమవుతుందని చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! యెరూషలేములో ఎవ్వరూ నివసించని రీతిలో అది ఎడారిలా మారిపోతుందని చెప్పటానికి నీకు ఎన్ని గుండెలు!” అని వారంతా యిర్మీయాను గద్దించారు. యెహోవా గుడిలో వారంతా యిర్మీయాను చుట్టు ముట్టారు.
ఇప్పుడు యూదా పాలకులు జరుగుతున్న విషయాలన్నీ విన్నారు. కావున వారు రాజభవనం నుండి బయటికి వచ్చారు. వారు దేవాలయానికి వెళ్లారు. అక్కడ దేవాలయానికి తిన్నగా వెళ్లే నూతన ద్వారం వద్ద తమ తమ స్థానాలను అలంకరించారు.
అప్పుడు యాజకులు, ప్రవక్తలు కలిసి పాలకులతోను, తదితర ప్రజలతోను మాట్లాడారు. “యిర్మీయా చంపబడాలి. యెరూషలేమును గురించి అతడు చాలా చెడ్డ విషయాలు చెప్పాడు. అతడా విషయాలు చెప్పటం మీరు కూడ విన్నారు” అని వారంతా చెప్పారు.
పిమ్మట యిర్మీయా యూదా పాలకులందరితోను, ఇతర ప్రజలతోను మాట్లాడాడు. అతనిలా చెప్పాడు: “ఈ ఆలయాన్ని గురించి, ఈ నగరాన్ని గురించి ఈ విషయాలు చెప్పమని యెహోవా నన్ను పంపాడు. మీరు వినియున్నదంతా యెహోవా తెలియజేసినదే.
ఓ ప్రజలారా, మీ జీవిత విధానం మార్చుకోండి! మీరు సత్కార్యాలు చేయుట మొదలుపెట్టండి! మీ దేవుడైన యెహోవాను మీరు అనుసరించాలి. మీరలా చేస్తే యెహోవా తన మనస్సు మార్చుకుంటాడు. యెహోవా మీకు వ్యతిరేకంగా తలపెట్టిన హానికరమైన పనులు చేయడు.
కాని మీరు నన్ను చంపితే, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఖచ్చితంగా ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరానికి పాల్పడిన వారవుతారు. అంతే కారు మీరీ నగరాన్ని, అందులోని ప్రతి పౌరుణ్ణి కూడ నేరస్థులుగా చేసిన వారవుతారు. యెహోవా నిజంగా నన్ను మీ వద్దకు పంపియున్నాడు. మీరు విన్న సందేశం వాస్తవంగా యెహోవా నుండే వచ్చనది.”
తరువాత పాలకులు, ప్రజలు అందరూ మాట్లాడారు. ఆ ప్రజలు యాజకులతోను “యిర్మీయా చంపబడకూడదు. యిర్మీయా మనకు చెప్పన విషయాలు మన యెహోవా దేవుని నుండి వచ్చినవే” అని అన్నారు.
“ప్రవక్తయైన మీకా మోరష్తీ నగర వాసి. యూదా రాజైన హిజ్కియా పాలనా కాలంలో మీకా ప్రవక్తగా వున్నాడు. యూదా ప్రజలందరికీ మీకా [‡మీకా మీకా 3:12 చూడండి.] ఈ విషయాలు చెప్పియున్నాడు: “సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే: సీయోను దున్నబడిన పొలంలా అవుతుంది! యెరూషలేము ఒక రాళ్ల గుట్టలా తయారవుతుంది! గుడివున్న పర్వతం, ఒక ఖాళీ కొండ [§ఖాళీ కొండ లేక ‘ఉన్నత స్థలము’ ఈ పదము సాధారణంగా స్థానిక ప్రజల ఆరాధనా స్థలాలకు వాడబడుతుంది. ఇక్కడ ప్రజలు విగ్రహాలను ఆరాధించేవారు.] పొదలతో నిండినట్లవుతుంది.
“హిజ్కియా యూదాకు రాజుగా వున్నప్పుడు హిజ్కియా మీకాను చంపలేదు. యూదా ప్రజలెవ్వరూ మీకాను చంపలేదు. హిజ్కియా యెహోవా పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడని మీకు తెలుసు. అతడు దేవుని సంతోష పరచాలని కోరుకున్నాడు. యూదా రాజ్యానికి కీడు చేస్తానని యెహోవా అన్నాడు. కాని హిజ్కియా యెహోవాను ప్రార్థించాడు. అందువల్ల యెహోవా తన మనస్సు మార్చుకున్నాడు. యెహోవా ముందుగా అన్నట్లు ఏ కీడూ చేయలేదు. ఇప్పుడు మనం యిర్మీయాను గాయపర్చితే, మనం మన మీదికే అనేక కష్టాలు తెచ్చి పెట్టుకుంటాము. ఆ కష్టాలన్నీ మన స్వంత తప్పులు.”
గతంలో యెహోవా సందేశాన్ని ప్రవచించిన మరో వ్యక్తి వున్నాడు. అతని పేరు ఊరియా. అతడు షెమయా అనేవాని కుమారుడు. ఊరియా కిర్యత్యారీము నగరవాసి. యిర్మీయా చెప్పిన మాదిరిగానే ఈ నగరాన్ని గురించి, ఈ రాజ్యాన్ని గురించి ఊరియా కూడ చెప్పియున్నాడు.
రాజైన యెహోయాకీము, అతని సైన్యాధికారులు, మరియు యూదాలోని ప్రజా నాయకులు ఊరియా బోధించినదంతా విన్నారు. వారికి చాలా కోపం వచ్చింది. రాజైన యెహోయాకీము ఊరియాను చంపగోరాడు. కాని యోహోయాకీము తనను చంపగోరుతున్నట్లు ఊరియా విన్నాడు. ఊరియా భయపడ్డాడు. అందుచే అతడు ఈజిప్టుకు తప్పించుకు పోయాడు.
ఆ మనుష్యులు ఊరియాను ఈజిప్టు నుండి తీసికొని వచ్చారు. వారు ఊరియాను రాజైన యెహోయాకీము వద్దకు తీసికొని వెళ్లారు. ఊరియాను కత్తితో నరికి చంపమని యెహోయాకీము ఆజ్ఞ యిచ్చాడు. పేద ప్రజల స్మశాన వాటికలో అతని శవం పారవేయబడింది.
షాఫాను కుమారుడైన అహీకాము అనే ప్రముఖ వ్యక్తి ఒకడున్నాడు. అహీకాము యిర్మీయాకు అండగావున్నాడు. అందుచే అహీకాము యాజకుల బారి నుండి, ప్రవక్తల బారి నుండి చంపబడకుండా యిర్మీయాను రక్షించాడు.