Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Jeremiah Chapters

Jeremiah 25 Verses

Bible Versions

Books

Jeremiah Chapters

Jeremiah 25 Verses

1 యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు చేరిన సందేశం ఇది. యెహోయాకీము యూదాకు రాజై పాలిస్తున్న నాల్గవ సంవత్సరంలో ఈ సందేశం వచ్చింది. యోషీయా కుమారుడు యెహోయాకీము. ఇతని పాలనలో నాల్గవ సంవత్సరం అయ్యే సరికి నెబకద్నెజరు బబలోనుకు రాజు కావటం, పరిపాలన ఒక సంవత్సరం కొనసాగించటం జరిగింది.
2 ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరికి, యెరూషలేము వాసులందరికి ఈ సందేశం ఇచ్చాడు:
3 యెహోవా నుండి వచ్చిన సందేశాలను గత ఇరవై మూడు సంవత్సరాలలో నేను మీకు పదే పదే ఇచ్చియున్నాను. అమోను కుమారుడైన యోషీయా యూదా రాజ్యాన్ని పదమూడవ సంవత్సరంలో పాలిస్తూ ఉన్నప్పటినుండి నేను ప్రవక్తగా కొనసాగుతున్నాను. ఆనాటి నుండి ఈ నాటి వరకు నేను మీకు యెహోవా సందేశాలను అందజేస్తూ వస్తున్నాను. కాని మీరు వినిపించుకోలేదు.
4 యెహోవా తన సేవకులై ప్రవక్తలను మరల, మరల మీ వద్దకు పంపాడు. కాని వారు చెప్పేది మీరు వినలేదు. మీరసలు వారిని లక్ష్య పెట్టలేదు.
5 ఆ ప్రవక్తలు, “మీ జీవిత విధానం మార్చుకోండి. ఆ చెడు కార్యాలు చేయటం మానండి. మీలోమార్పు వస్తే, ఏనాడో దేవుడు మీరు నివసించుటకు మీ పితరులకు ఇచ్చిన రాజ్యానికి మీరు తిరిగి రాగలరు. మీరు శాశ్వాతంగా నివసించటానికి ఈ రాజ్యాన్ని ఆయన మీకిచ్చాడు.
6 అన్య దేవతలను అనుసరించకండి. వాటిని సేవించవద్దు. ఆరాధించవద్దు. మానవ హస్తాలతో చేసిన విగ్రహాలను పూజించకండి. అదే మీపట్ల నాకు కోపం కల్గిస్తూ వుంది. ఇది చేయటం వల్ల మీకు మీరే హాని కలుగజేసుకుంటున్నారు.!”
7 “కాని మీరు నా మాట వినలేదు” ఇది యెహోవా వాక్కు “ఎవడో ఒక వ్యక్తి చేసిన విగ్రహాలను మీరు పూజించారు. అది నన్ను ఆగ్ర హపర్చింది. అదే మిమ్ము బాధ పెట్టింది.”
8 కావున సర్వ శక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు: “మీరు నా వర్తమానాలను వినలేదు.
9 అందుచేత నేను శీఘ్రమే ఉత్తరదేశం నుండి ప్రజలందరి కొరకు ఒకనిని పంపుతాను.” ఇదే యెహోవా వాక్కు. “బబలోను రాజైన నెబకద్నెజరును వెంటనే పిలిపిస్తాను. అతడు నా సేవకుడు. ఆ జనాన్ని యూదా రాజ్యం మీదికి, దాని ప్రజలపైకి రప్పిస్తాను. అంతేగాదు. వారిని మీ చుట్టూ వున్న దేశాల మీదికి కూడ రప్పిస్తాను. ఆయా దేశాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. వాటిని శాశ్వతమైన ఎడారిగా మార్చి వేస్తాను. ప్రజలు ఆయా దేశాలను చూచి అవి ఎలా నాశనమయినాయో అని విస్మయం పొందుతారు.
10 ఆ ప్రాంతంలో ఆనందోత్సాహాలను అంతం చేస్తాను. వివాహ వేడుకలు ఏ మాత్రం ఉండవు. తిరుగలి రాళ్ల శబ్దాలను, దీపాల వెలుగును మాయం చేస్తాను.
11 ఆ ప్రాంతమంతా ఒక పనికిరాని ఎడారిలా మారి పోతుంది. ఆ ప్రజలంతా బబలోను రాజుకింద డెబ్బయి ఏండ్ల పాటు బానిసలవుతారు.
12 “కాని డెబ్బయి సంవత్సరాల అనంతరం నేను బబలోను రాజును శిక్షిస్తాను. బబలోను రాజ్యాన్ని కూడా శిక్షకు గురి చేస్తాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “కల్దీయుల దేశాన్ని కూడా వారు పాపాల నిమిత్తంగా శిక్షిస్తాను. ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా ఎడారిలా మార్చివేస్తాను.
13 బబలోనుకు చాలా కష్టనష్టాలు కలుగుతాయిని చెప్పియున్నాను. అవన్నీ జరిగి తీరుతాయి. యిర్మీయా ఆ పరాయి రాజ్యాల గురించి ప్రవచించియున్నాడు. ఆ హెచ్చరికలన్నీ ఈ గ్రంథంలో వ్రాయబడినాయి.
14 అవును. బబలోను ప్రజలు చాలా దేశాలలో ఎక్కుమంది గొప్ప రాజులకు సేవలు చేయాల్సి ఉంటుంది. వారు చేసే పనులన్నిటికీ అర్హమైన శిక్ష వారికి నేను విధిస్తాను.”
15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: “యిర్మీయా, ఈ ద్రాక్షా రసపు గిన్నెను నా చేతి నుండి తీసుకో. ఇది నా కోపరసం. నిన్ను నేను వివిధ దేశాలకు పంపుతున్నాను. ఆయా దేశాల వారిని ఈ గిన్నె నుండి తాగేలా చేయుము.
16 వారీ ద్రాక్షారసాన్ని తాగుతారు. పిదప వారు వాంతి చేసుకొని, పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. నేను త్వరలో వారి పైకి పంపబోయే కత్తి దృష్ట్యా వారలా చేస్తారు.”
17 కావున యెహోవా చేతి నుండి నేను ఆ గిన్నె అందుకొని యెహోవా పంపిన ప్రజలందరి యొద్దకు వెళ్లాను.
18 యెరూషలేము వాసులకు, యూదా వారికి ఈ ద్రాక్షారసం పోశాను. యూదా రాజులను, నాయకులను ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. వారిని ఎడారిలా మార్చివేయాలని. నేనీ విధంగా ఎందుకు చేశానంటే ఆ ప్రదేశం సర్వనాశనం కావాలని, అది చూచి ప్రజలు కలవర పడిరి. దానిని శపించితిని. చివరికి అలానే జరిగింది. యూదా ఇప్పుడు అలానే తయారయింది.
19 ఈజిప్టు రాజైన ఫరోను కూడా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. అతని అధికారులను, అతని ముఖ్య నాయకులను, మరియు అతని ప్రజలందరినీ యెహోవా కోపపు గిన్నె నుండి తాగేలా చేశాను.
20 అరబి దేశీయులు, మరియు ఊజు దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా నేను చేశాను. ఫిలిష్తీయుల రాజులను కూడా ఈ గిన్నెతో తాగేలా చేశాను. వీరు అష్కెలోను, గాజ, ఎక్రోను నగరాల రాజులు, మరియు అష్డోదులో మిగిలిన రాజ్యానికి అధిపతులు.
21 పిమ్మట ఎదోము, మోయాబు, మరియు అమ్మోను ప్రజలు ఈ గిన్నెతో తాగేలా చేశాను.
22 తూరు రాజులు సీదోను రాజులు కూడ ఈ గిన్నెతో తాగేలా చేశాను. దూరదేశాపు రాజులందరి చేత ఆ గిన్నెతో తాగించాను.
23 దదాను ప్రజలు, తేమానీయులు, బూజీయులందరూ ఈ గిన్నెతో తాగేలా చేశాను. కణతల వద్ద తమ వెంట్రుకలు గొరిగించుకొనే వారందరినీ ఈ గిన్నెతో తాగేలా చేశాను.
24 అరబి రాజులంతా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఈ రాజులు ఎడారిలో నివసిస్తారు.
25 జిమ్రీ రాజులు, ఏలాము రాజులు, మరియు మాదీయుల రాజులు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను.
26 దగ్గరలో ఉన్న, దూరాన ఉన్న ఉత్తర దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఒకరి తరువాత ఒకరు వారంతా తాగేలా చేశాను. యెహోవా కోపపు గిన్నె నుండి భూమిమీద గల రాజ్యాల వారంతా తాగేలా చేశాను. కాని బబలోను రాజు మాత్రం ఇతర రాజ్యాల వారంతా తాగిన పిమ్మట ఆ గిన్నె నుండి ఆఖరికి తాగుతాడు.
27 “యిర్మీయా! ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడని ఆయా రాజ్యాల వారికి తెలియజేయుము: ‘నా కోపపు గిన్నె నుండి తాగండి. మైకం వచ్చేలా తాగి వాంతి చేసుకోండి! కింద పడి మరల లేవకుండా ఉండండి. ఎందువల్లనంటే మిమ్మల్ని చంపటానికి కత్తిని మీమీదికి పంపుతున్నాను!’
28 “ఆ ప్రజలు నీ చేతి నుండి గిన్నెను తీసికోవటానికి నిరాకరిస్తారు. వారు దాని నుండి త్రాగటానికి ఒప్పుకోరు. అయినా నీవు వారిని పిలిచి ఇలా చెప్పాలి: ‘సర్వశక్తిమంతుడైన దేవుడీ సంగతులు తెలియజేస్తున్నాడు. మీరు నిజానికి ఈ గిన్నె నుండి తాగాలి!
29 నా పేరుతో పిలవబడే యోరూషలేము నగరానికి ముప్పు తేవటం మొదలు పెట్టాను. బహుశః మీరు శిక్షింపబడక పోవచ్చునని మీరనుకుంటూ ఉండవచ్చు. అయితే మీరు పొరబడుతున్నారు. మీరు శిక్షింపబడతారు. భూమి మీదనున్న ప్రజలందరినీ ఎదుర్కోవటానికి నేను కత్తిని పంపుతున్నాను.”‘ ఇదే యెహోవా వాక్కు.
30 “యిర్మీయా, ఈ వర్తమానం వారికి అందజేయి: ‘ఉన్నతమైన, పవిత్రమైన తన ఆలయం నుండి యెహోవా నిలుగెత్తి చాటుతున్నాడు. యెహోవా తన పచ్చిక బీడు (ప్రజలు)కు వ్యతిరేకంగా చాటుతున్నాడు. ఆయన ద్రాక్షారసం తీసే వారిలా బిగ్గరగా కేకలేస్తున్నాడు.
31 ఆ శబ్దం మోత భూమిపై ప్రజలందరికి చేరుతుంది. అసలీ శబ్దం ఎందుకు? యెహోవా అన్ని దేశాల ప్రజలనూ శిక్షిస్తున్నాడు. యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా తన వాదన తెలియజెప్పాడు ఆయన ప్రజలపై తీర్పు ఇచ్చాడు. ఆయన కత్తితో దుష్ట సంహారం చేస్తున్నాడు.”‘ ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం.
32 సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే: “ఒక దేశాన్నుండి మరొక దేశానికి విపత్తులు త్వరలో వ్యాపిస్తున్నాయి. అవి పెనుతుఫానులా భూమిపై సుదూర తీరాల వరకు వ్యాపిస్తాయి!”
33 ఆ ప్రజల శవాలు దేశం ఒక అంచు నుండి మరో అంచువరకు పడి ఉంటాయి. చనిపోయిన వారి కొరకు విలపించే వారొక్కరూ ఉండరు. ఆ శవాలను ఎవ్వరూ సేకరించి సమాధి చేయరు పశువుల పేడవలె అవి నేలపై పడి ఉంటాయి.
34 కాపరులారా (నాయకులారా), మీరు మందను (ప్రజలను) కాయవలసి ఉంది. కాని ఓ గొప్ప నాయకులారా, రోదించటం మొదలు పెట్టండి. గొర్రెల కాపరులారా, నేలమీద పడి బాధతో పొర్లండి ఎందువల్లనంటే మీరు సంహరించబడే సమయం సమీపిస్తూ ఉంది. మిమ్ములను కొట్టి చెల్లా చెదరు చేస్తాను. పగిలిన కుండ పెంకుల్లా మీరు చిందర వందరై పోతారు!
35 గొర్రెల కాపరులు (నాయకులు) దాగటానికి తావే దొరకదు! ఆ నాయకులు తప్పించుకోలేరు!
36 కాపరులు (నాయకులు) అరవటం నేను వింటున్నాను. మంద (ప్రజలు) కాపరులు రోదించటం నేను వింటున్నాను! యెహోవా వారి పచ్చిక బయళ్లను (దేశం) నాశనం చేస్తున్నాడు!
37 ఆ ప్రశాంతమైన పచ్చిక బయళ్లు (భవనాలు) నాశనం చేయబడి వట్టి ఎడారిలా అవుతాయి. యెహోవా మిక్కిలి కోపంగా వున్న కారణంగా ఇది జరిగింది.
38 తన గుహనుండి బయటికి వస్తున్న ఒక భయంకరమైన సింహంలా యెహోవా ఉన్నాడు. యెహోవా కోపంగా ఉన్నాడు! యెహోవా కోపం ఆ ప్రజలకు హాని కల్గించింది! వారి రాజ్యం వట్టి ఎడారిలా అయిపోయింది.

Jeremiah 25:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×