Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Books

Jeremiah Chapters

Jeremiah 14 Verses

1 అనావృష్టి విషయమై ఇది యిర్మీయాకు యెహోవా పంపిన వర్తమానం:
2 “యూదా రాజ్యం చనిపోయిన వారికొరకు రోధిస్తుంది. యూదా నగరాల ప్రజలు నానాటికీ బలహీనమౌతారు. వారు నేలమీద పడతారు. యెరూషలేము నుండి ఒక రోదన దేవుని వద్దకు వెళుతుంది.
3 ప్రజా నాయకులు వారి సేవకుల నీటికొరకు పంపుతారు. సేవకులు జలాశయాల వద్దకు వెళతారు. కాని వారికి నీరు దొరకదు. సేవకులు ఖాళీ కూజాలతో తిరిగి వస్తారు. దానితో వారు సిగ్గుపడి, కలత చెందుతారు. అవమానంతో వారి తలలు బట్టతో కప్పుకుంటారు.
4 ఒక్కడు కూడా భూమిని దున్ని సాగుచేయడు రాజ్యంలో వర్షం కురియదు. రైతులు నిరాశతో కుంగి పోతారు. వారు సిగ్గుతో తమ ముఖాలు కప్పుకుంటారు.
5 పొలంలో ఈనిన దుప్పి సహితం తన పిల్లను వదిలిపోతుంది. పచ్చిక దొరకని కారణంగా అది అలా చేస్తుంది.
6 అడవి గాడిదలు వట్టి కొండలపైన నిలబడతాయి. గుంటనక్కల్లా అవి గాలిని వాసన చూస్తాయి. వాటి కంటికి ఆహారమే కన్పించదు. ఎందువల్లనంటే వాటికి తినటానికి ఎక్కడా మొక్కలు లేవు.
7 “నా ప్రజలిలా నాకు మొరపెట్టుకుంటారు: జరిగిన విషయాలన్నిటకీ మా తప్పులే కారణమని మాకు తెలుసు. మా పాపాల ఫలంగా మేమిప్పుడు కష్టాలనుభవిస్తున్నాము. యెహోవా, నీ నామ ఘనత కొరకు ఏదో ఒకటి చేసి మాకు సహాయపడుము. నిన్ను అనేక సార్లు మేము వదిలిపెట్టినట్లు మేము ఒప్పుకుంటున్నాము. నీ పట్ల మేము పాపం చేశాము.
8 ఓ దేవా! ఇశ్రాయేలుకు నీవు ఆశాజ్యోతివి! కష్ట కాలంలో ఇశ్రాయేలును ఆదుకొనేవాడవు నీవే. అయినా ఇప్పుడి దేశంలో పరాయి వానిలా ప్రవర్తిస్తున్నావు. ఒక్కరాత్రి ఉండిపోయే బాటసారిలా ఉన్నావు.
9 ఆకస్మికంగా దాడి చేయబడిన వ్యక్తిలా ఉన్నావు. ఎవ్వరినీ రక్షించలేని అశక్తుడైన సైనికునిలా ఉన్నావు. అయినా నీవు మాతో ఉన్నావు. యెహోవా, నీ పేరుతో మేము పిలువబడుతూ ఉన్నావు. మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి పెట్టవద్దు!”
10 యూదా ప్రజల విషయంలో యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టటానికి ఇష్టపడ్తారు. వారు నన్ను వదిలి వెళ్లటంలో ఏమాత్రం వెనుకాడరు. కనుక ఇప్పుడు నేను వారిని అంగీకరించను. వారు చెసిన దుష్టకార్యాలను నేను గుర్తు పెట్టుకుంటాను. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను.”
11 పిమ్మట యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, యూదా ప్రజలకు శుభం కలగాలని ప్రార్థన చేయవద్దు.
12 యూదా ప్రజలు ఉపవాసాలు మొదలుపెట్టి నన్ను ప్రార్థించవచ్చు. కాని నేను వారి ప్రార్థనలు వినను. వారు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు సమర్పించినా ఆ ప్రజలను నేను అంగీకరించను. యుద్ధం ద్వారా యూదా వారిని నేను నాశనం చేస్తాను. వారి ఆహార ధాన్యాలను తీసుకుంటాను. వారు ఆకలితో అలమటిస్తారు. పైగా వారిని భయంకర వ్యాధులకు గురి చేసి నాశనం చేస్తాను.”
13 కాని నేను యెహోవాతో ఇలా అన్నాను: “నా ప్రభువా, ప్రజలకు ప్రవక్తలు వేరొక రకంగా చెపు తున్నారు. ప్రజలు శత్రువు కత్తికి గురికావలసిన గతి పట్టదనీ, వారికి కరువు రాదనీ, యెహోవా ఈ రాజ్యంలోనే వారికి సుఖశాంతులు కలుగజేస్తాడనీ ప్రవక్తలు చెపుతున్నారు.”
14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, ఆ ప్రవక్తలు నా పేరుతో అబద్దాలు బోధిస్తున్నారు. ఆ ప్రవక్తలను నేను పంపలేదు. నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. వారితో నేను మాట్లాడలేదు. ఆ ప్రవక్తలు బోధించేదంతా అబద్ధపు దర్శనాలు. వట్టి కనికట్టు. అది వారి స్వంత కల్పన.
15 అందువలన నా పేరుతో భవిష్యత్తును చెప్పే ప్రవక్తల విషయంలో నేను చెప్పేదేమంటే వారిని నేను పంపలేదు. ఆ ప్రవక్తలు ‘కత్తిపట్టిన శత్రువెవ్వడూ ఈ రాజ్యంమీదికి రాడు. ఈ రాజ్యంలో కరువనేది ఉండదు,’ అని కదా చెప్పారు. చూడుము; ఆ ప్రవక్తలే ఆకలితో మాడి చనిపోతారు. శత్రువు కత్తికి బలియైపోతారు.
16 ఆ ప్రవక్తలు ఏ ప్రజలతో మాట్లాడినారో, వారు వీధిలోనికి లాగబడతారు. ఆ ప్రజలు ఆకలితో చనిపోతారు. శత్రువుల కత్తి వారిని నరికివేస్తుంది. వారినిగాని, వారి భార్యలను గాని, వారి కుమారులను లేక కుమార్తెలను గాని పాతి పెట్టటానికి ఒక్కడుకూడా మిగలడు! నేను వారిని శిక్షిస్తాను.
17 “యిర్మీయా, యూదా ప్రజలకు ఈ వర్తమానం అందజేయి. ‘నా కండ్లు కన్నీళ్ళతో నిండాయి. రాత్రింబవళ్లు నేను ఎల్లప్పుడూ విలపిస్తాను. కన్యయగు నా కుమార్తె కొరకు విలపిస్తాను. నా ప్రజలకొరకు నేను దుఃఖిస్తాను. ఎందువల్లనంటే అన్యుడొకడు వారిని గాయపర్చినాడు; వారిని అణగద్రొక్కినాడు. వారు తీవ్రంగా గాయపర్చబడినారు.
18 నేను పల్లెపట్టులకు వెళితే, కత్తులతో సంహరింపబడినవారిని చూస్తారు. నేను నగరానికి వెళితే అక్కడ నేను తిండి లేక రోగగ్రస్థులైన వారిని చూస్తాను. యాజకులు, ప్రవక్తలు వారెరుగని అన్యదేశానికి కొనిపోబడ్డారు.”
19 యోహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా విడనాడావా? యెహోవా, సీయోనును నీవు ప్రేమించడం లేదా? నీవు మమ్ములను గాయపర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలే మనిపిస్తున్నది. నీవు ఆ పని ఎందుకు చేశావు? మేము శాంతిని కోరుకుంటున్నాము. కాని దాని వల్ల ఏమీ మంచి జరుగలేదు. మేము స్వస్థపడే సమయం కొరకు ఎదురుచూశాము; కాని భయము పుట్టుచున్నది.
20 యెహోవా, మేము చాలా దుర్మార్గులమని మాకు తెలుసు. మా పూర్వీకులు చెడుపనులు చేసినట్లు మాకు తెలుసు. అవును. మేము నీ పట్ల పాపం చేశాము.
21 యెహోవా, ఉన్నతమైన నీ నామము కొరకై నా మమ్మల్ని తోసివేయవద్దు! దివ్యమైన నీ సింహాసనపు గౌరవాన్ని తగ్గించవద్దు. మాతో నీవు చేసిన ఒడంబడికను గుర్తుంచుకోవాలి. ఆ నిబంధనను మరువవద్దు.
22 అన్య దేవతల విగ్రహాలకు వర్షం కురిపించే శక్తిలేదు. ఆకాశానికి వర్షాలను పంపే ప్రభావము లేదు. నీవే మాకు దిక్కు నీవే ఈ కార్యములన్నీ జరిపించేది.”
×

Alert

×