నేను నీ పూర్వీకులతో చేసుకొన్న ఒడంబడిక విషయం మాట్లాడుతున్నాను. వారిని ఈజిప్టునుండి నేను తీసుకొని వచ్చినప్పుడు నేనా ఒడంబడికను వారితో చేసుకొన్నాను. ఈజిప్టు అనేక కష్టాలున్న స్థలము అది ఇనుము కూడా కరిగి పోయేటంత వేడిగల పొయ్యిలాఉంది. నాకు విధేయులై, నేనాజ్ఞాపించినదంతా చేయండని ఆ ప్రజలకు చెప్పాను. మీరిది చేస్తే, మీరు నా ప్రజలవుతారు. పైగా నేను మీ దేవుడనవుతాను.
“నేను మీ పూర్వీకులకు చేసిన వాగ్దానం నెరవేర్చటానికి నేనిది చేశాను. వారికి నేనొక సారవంతమైన భూమిని ప్రసాధిస్తానని వాగ్దానం చేశాను. పాలు, తేనెలు ప్రవహించే భూమి ఇస్తానని అన్నాను. ఈనాడు మీరు ఆ రాజ్యంలో నివసిస్తున్నారు.” నేను (యిర్మీయా) “ఆ ప్రకారమే జరగాలి ప్రభువా” అని అన్నాను.
నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, ఈ సమాచారం యూదా పట్టణాలలోను, యెరూషలేము వీధులలోను ప్రకటించుము: ఈ ఒడంబడిక నియమాలు వినండి. ఆ ఒడంబడికలోని న్యాయసూత్రాలను పాటించండి.
ఈజిప్టునుండి విడుదల చేసి మీ పితరులను నేను తీసుకొని వచ్చినప్పుడు వారికి ఒక హెచ్చరిక చేశాను. ఈ రోజువరకూ వారికి పదే పదే హెచ్చరికలు చేస్తూనే వచ్చాను. నాకు విధేయులై వుండమని వారికి చెప్పాను.
కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. వారు మొండివైఖరి దాల్చారు. వారు దుష్ట హృదయాలు ఎలా చెపితే అలా ప్రవర్తించారు. ఒడంబడిక ప్రకారం వారు దానిని అనుసరించకపోతే వారికి కీడు వాటిల్లుతుంది. అందువల్లనే వారికి కష్టాలు సంభవించేలా నేను చేశాను! ఒడంబడికకు కట్టుబడి ఉండమని వారికి నేను ఆజ్ఞ ఇచ్చాను. కాని వారు పాటించలేదు.”
ఆ ప్రజలు వారి పితరులు చేసిన పాపములన్నీ చేస్తున్నారు! వారి పూర్వీకులు నా వర్తమానం వినటానికి నిరాకరించారు. వారు అన్యదేవతలను అనుసరించి, ఆరాధించారు. ఇశ్రాయేలు వంశం వారు, యూదా వంశం వారు వారి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను ఉల్లంఘించినారు.”
కావున యెహోవా ఇలా చెప్పినాడు, “త్వరలో యూదా వారికి భయంకర విపత్తు సంభవించేలా చేస్తాను. వారు దానినుండి తప్పించుకోలేరు! వారు దుఃఖపడతారు. వారు నా సహాయంకొరకు రోదిస్తారు. అయినా నేను వారి రోదన వినను.
అప్పుడు యూదా వారు, యెరూషలేము వాసులు తమ విగ్రహాలవద్దకు వెళ్లి సహాయం అర్థిస్తారు. వారు విగ్రహాలకు సాంబ్రాణి పొగ వేస్తారు. కాని ఆ విపత్కాలం వచ్చినప్పుడు ఆ విగ్రహాలు యూదా ప్రజలను ఆదుకోలేవు.
“యూదా ప్రజలారా, మీకు చాలా విగ్రహాలున్నాయి. యూదా రాజ్యంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని విగ్రహాలు మీలో వున్నాయి. ఆ ఏహ్యమైన బయలు దేవతను ఆరాధించటానికి మీరు చాలా బలిపీఠములను నిర్మించారు. యోరూషలేములో ఎన్ని వీధులున్నాయో అన్ని బలిపీఠాలున్నాయి.
“యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు అర్థించవద్దు. వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను వినను. ఆ ప్రజలకు బాధలు మొదలవుతాయి. అప్పుడు సహాయం కొరకు నన్ను పిలుస్తారు. కాని నేను వినను.
[*15, 16వ వచనాలు ఈ వచనాల సరియైన అర్థం మనకు రూఢిగా తెలియదు.] “నా ప్రేయసి (యూదా) నా ఇంట్లో (ఆలయం) ఎందుకు ఉన్నది? అక్కడ ఉండే హక్కు ఆమెకు లేదు. ఆమే చాలా చెడుపనులు చేసింది. యూదా! నీవర్పించే ప్రత్యేక ప్రమాణాలు, బలులు నీవు నాశనంగాకుండా ఆపగలవని నీవనుకుంటున్నావా? నాకు బలులు అర్పించటం ద్వారా నీవు శిక్షనుండి తప్పించుకోగలవని తలుస్తున్నావా?”
యెహోవా నీకొక పేరు ఇచ్చాడు. “కంటికింపైన పచ్చని బలివ చెట్టు” అని నిన్ను పిలిచాడు కాని ఆ చెట్టును బలమైన గాలిచే విసరబడే అగ్నితో యెహోవా కాల్చివేస్తాడు. దాని కొమ్మలన్నీ బూడిదై పోతాయి.
సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్ములను నాటి స్థిరపర్చినా కాని ఆయనే మీకు విపత్తు వస్తుందని ప్రకటించాడు. ఎందువల్లనంటే, ఇశ్రాయేలు వంశం వారు, యూదా వంశం వారు చెడు కార్యాలు చేశారు. మీరు బూటకపు దేవత బయలుకు బయట బలులు సమర్పించి యెహహోవాకు కోపం తెప్పించారు.
అనాతోతు ప్రజలు [†అనాతోతు ప్రజలు అనాతోతు యిర్మీయా స్వస్థలం. తనపై కుట్రపన్నిన వారిలో తన స్వంత బంధువులు కూడవున్నారు. చూడండి: యిర్మీయా 12:6.] నాపై కుట్ర పన్నుతున్నారని యెహోవా నాకు తెలియపరిచాడు. వారు చేసే పనులు యెహోవా నాకు చూపాడు. అందుచే వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలిసింది.
వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని యెహోవా తెలియపర్చక ముందు, నేనొక అమాయకపు గొర్రె పిల్లవలె నరకబడటానికి సిద్ధంగా వున్నాను. వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నేను అర్థం చేసికోలేదు. నన్ను గురించి వారిలా అంటున్నారు: “మనం చెట్టును, దాని పండును నాశనం చేద్దాం! మనం వానిని చంపివేద్దాం! అప్పుడు ప్రజలు అతన్ని మర్చిపోతారు.”
యెహోవా, నీవు సత్య వర్తనుడవైన న్యాయాధి పతివి. ప్రజల మనస్సులను, హృదయాలను పరీక్షించే విధానం నీకు బాగా తెలుసు. నేను నా వాదనలను నీకు వినిపిస్తాను. వారికి అర్హమైన శిక్ష నీవే యిమ్ము.
అనాతోతు మనుష్యులు యిర్మీయాను చంపుటకు పథకం పన్నుచుండిరి. వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీవు యెహోవా పేరుతో ప్రకటనలు చేయవద్దు. లేనిచో నిన్ను మేము చంపివేస్తాం.” అనాతోతు మనుష్యుల విషయంలో యెహోవా ఒక నిర్ణయానికి వచ్చాడు.
సర్వశక్షిమంతుడైన యెహోవా ఇలా చెప్పాడు, “నేను త్వరలో అనాతోతు ప్రజలను శిక్షిస్తాను. వారి యువకులు యుద్ధంలో మరణిస్తారు. వారి కుమారులు, కమార్తెలు ఆకలితో మాడి చనిపోతారు.