మీ దగ్గరున్న వెండి బంగారాలకు త్రుప్పు పడుతుంది. వాటి త్రుప్పు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మీ శరీరాల్ని నిప్పులా కాల్చి వేస్తుంది. చివరి దినాలకు మీరు ధనాన్ని దాచుకొన్నారు.
మీ పొలాల్ని సాగుచేసిన పనివాళ్ళకు మీరు కూలి యివ్వలేదు. వాళ్ళు ఏడుస్తూ మీపై ఫిర్యాదు చేస్తున్నారు. ఆ కూలివాళ్ళ ఏడ్పులు సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు చెవిలోపడ్డాయి.
అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకొని ఉంటాడు.
కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్న వాళ్ళను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసిన దాన్ని చూసారు. ప్రభువులో దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి.
నా సోదరులారా! అన్నిటికన్నా ముఖ్యమైనదేమిటంటే, పరలోకం పేరిట గాని, భూమి పేరిట గాని, మరేదానిపై గాని ఒట్టు పెట్టుకోకండి. మీరు “ఔను” అని అనాలనుకొంటె “ఔను” అనండి. “కాదు” అని అనాలనుకొంటె “కాదు” అని అనండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షించడు.
అందువల్ల చేసిన తప్పుల్ని పరస్పరం ఒప్పుకోండి. ఒకిరికొకరు ప్రార్థించండి. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. నీతిమంతుని ప్రార్థన బహు బలముగలది. కనుక ఎంతో మేలు చేయగలదు.