మండుతున్న పొదల్లా, పర్వతాలు అగ్ని జ్వాలల్లో కాలిపోతాయి. నిప్పుమీది నీళ్లలా పర్వతాలు కాగిపోతాయి. అప్పుడు నీ శత్రువులు నిన్ను గూర్చి తెలుసుకొంటారు. అప్పుడు రాజ్యాలన్ని నిన్ను చూడగా భయంతో వణుకుతాయి.
నీ ప్రజలు నిజంగా ఎన్నడూ నీ మాట వినలేదు. నీవు చెప్పిన విషయాలను నీ ప్రజలు నిజంగా ఎన్నడూ వినలేదు. నీవంటి దేవుణ్ణి ఏ మనిషీ ఎన్నడూ చూడలేదు. నీవు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు. ప్రజలు సహనంతో నీకొరకు కనిపెట్టివుంటే అప్పుడు నీవు వారికోసం గొప్ప కార్యాలు చేస్తావు.
మేలు చేయటంలో ఆనందించే మనుష్యులతో నీవు ఉన్నావు. నీ జీవన విధానాలను ఆ మనుష్యులు జ్ఞాపకం చేసుకొంటారు. కానీ చూడు, గతంలో మేము నీకు విరోధంగా పాపం చేశాము అందుచేత నీవు మా మీద కోపగించావు.
మేము నిన్ను ఆరాధించటం లేదు, నీ నామం మేము విశ్వసించలేదు. నిన్ను వెంబడించాలనే సంబరం మాలో ఎవ్వరికీ లేదు. అందుచేత నీవు మా వద్దనుండి తిరిగిపోయావు. మేము పాపంతో నిండిపోయాం గనుక నీ ఎదుట మేము నిస్సహాయులం.
మా పవిత్ర ఆలయం అగ్నిచేత కాల్చి వేయబడింది. ఆ ఆలయం మాకు ఎంతో గొప్పది. మా తండ్రులు అక్కడ నిన్ను ఆరాధించారు. మాకు ఉండిన మంచి వస్తువులన్నీ ఇప్పుడు నాశనం చేయబడ్డాయి.