యెహోవా ఈ సంగతులు చెప్పాడు, “మనుష్యులందరికి న్యాయం చూపండి. సరైన వాటినే చేయండి. ఎందుకంటే త్యరలోనే నా రక్షణ మీకు లభిస్తుంది. నా మంచితనం [*నా మంచితనం లేక “విజయం.”] త్వరలోనే సర్వలోకానికి చూపించబడుతుంది గనుక.”
సబ్బాతును [†సబ్బాతు యూదుల విశ్రాంతి, ఆరాధనలను ప్రత్యేకమైన రోజు.] గూర్చిన దేవుని చట్టానికి విధేయత చూపే వ్యక్తి ఆశీర్వదించబడును. ఏ కీడు చేయని వ్యక్తి సంతోషంగా ఉంటాడు.
యూదులు కాని మనుష్యులు కొందరు యెహోవా వైపు తిరుగుతారు. “యెహోవా తన ప్రజలతో పాటు నన్ను స్వీకరించడు” అని ఆ మనుష్యులు చెప్పకూడదు. “నేను ఎండిన కట్టె ముక్కను, నాకు పిల్లలు పుట్టరు” అని నపుంసకుడు చెప్పకూడదు.
(4-5) “సబ్బాతుకు సంబంధించిన చట్టాలకు విధేయులయ్యే నపుంసకులకు నేను శక్తి, కీర్తి ప్రసాదిస్తాను. నేను కోరే వాటిని జరిగించే నపుంసకులకు నేను శక్తి, కీర్తి ప్రసాదిస్తాను. వారు నా ఆలయంలో, నా పట్టణంలో ఉంటారు. నా ఒడంబడికను [‡ఒడంబడిక సాధారణంగా ఇది మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన ఒప్పందం. ఇక్కడ యెషయా 55:3 లో ఒప్పందం కావచ్చు.] పాటించే నా ప్రజలందరికీ నేను ఈ విషయాలు జరిగిస్తాను. కుమారులు, కుమార్తెలకంటె శ్రేష్ఠమైన దానిని నేను వారికి ఇస్తాను. శాశ్వతంగా కొనసాగే పేరు నేను వారికి ఇస్తాను” అని యెహోవా చెబుతున్నాడు గనుక వారు ఆ మాటలు చెప్పకూడదు.
యూదులు కాని మనుష్యులు కొందరు యెహోవావైపు చేరుతారు. యెహోవాను సేవించి, ఆయనను ప్రే మించగలిగేట్టు వారు ఇలా చేస్తారు. వారు యెహోవాకు సేవకులు అయ్యేందుకు యెహోవావైపు చేరుతారు. సబ్బాతును ప్రత్యేక ఆరాధన రోజుగా వారు పాటిస్తారు, నా ఒడంబడిక (ధర్మశాస్త్రాన్ని) సన్నిహితంగా పాటించటం కొనసాగిస్తారు.
“ఆ మనుష్యులను నా పరిశుద్ధ పర్వతానికి నేను తీసుకొని వస్తాను. నా ప్రార్థనా మందిరంలో నేను వారిని సంతోషింప చేస్తాను. వారు నాకు అర్పించే అర్పణలు, బలులు నాకు సంతోషం కలిగిస్తాయి. ఎందుకంటే, నా ఆలయం సకల రాజ్యాలకూ ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది గనుక” అని యెహోవా చెబుతున్నాడు.
నా ప్రభువు యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టబడ్డారు. కానీ యెహోవా వారిని మరల ఒక్కచోట చేరుస్తాడు. “ఈ ప్రజలను నేను మరల ఒక్కచోట చేరుస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.
కావలి వాళ్లు (ప్రవక్తలు) అందరు గుడ్డివాళ్లు. వారు చేస్తుంది ఏమిటో వారికే తెలియదు. వారు మొరగటం చేతకాని కుక్కల్లాంటి వాళ్లు. వారు నేలమీద పండుకొని, నిద్రపోతారు. ఆహా, నిద్రపోవటం వారికి ఇష్టం.
వారు ఆకలిగొన్న కుక్కల్లా ఉన్నారు. వారు ఎన్నటికి తృప్తిపొందరు. ఆ కాపరులు ఏమిచేస్తున్నది. వారికే తెలియదు. తప్పిపోయి తిరుగుతున్న వారి గొర్రెల్లానే ఉన్నారు వారూను. వారు దురాశపరులు. వారు చేయాలని ఆశించేది అంతా వారిని వారు తృప్తిపరచు కోవటమే.
“నేను కొంచెం ద్రాక్షరసం తాగుతాను. నేను కొంచెం మద్యం తాగుతాను. నేను రేపు కూడా ఇలానే చేస్తాను. ఆ తర్వాత నేను ఇంకా ఎక్కువ కూడా తాగుతాను” అని వారు వచ్చి చెబుతారు.