యెహోవా ఆలయం ఒక కొండమీద ఉంది. చివరి రోజుల్లో ఆ కొండ, పర్వతాలన్నింటిలో ఎత్తయినదిగా చేయబడుతుంది. ఆ పర్వతం కొండల శిఖరాలన్నింటికంటె ఎత్తు చేయబడుతుంది. అన్ని రాజ్యాల ప్రజలూ అక్కడికి వెళ్తారు.
అనేకమంది ప్రజలు అక్కడికి వెళ్తారు. “మనం యెహోవా పర్వతానికి వెళ్దాం. యాకోబు దేవుని మందిరానికి మనం వెళ్లాలి. అప్పుడు యెహోవా తన జీవన విధానం మనకు ఉపదేశిస్తాడు. మనం ఆయనను వెంబడిస్తాం” అని వాళ్లు చెబుతారు. దేవుని ఉపదేశాలు, యెహోవా సందేశం యెరూషలేములో, సీయోను కొండమీద ప్రారంభమై, ప్రపంచం అంతటికీ వ్యాపిస్తుంది.
అప్పుడు అన్ని రాజ్యాల ప్రజలకూ యెహోవా న్యాయమూర్తిగా ఉంటాడు. అనేకుల వాదాలను దేవుడు అంతంజేస్తాడు. ఆ మనుష్యులు తమ పోరాటానికి తమ ఆయుధాలు ఉపయోగించటం మానివేస్తారు. వారు తమ ఖడ్గాలతో నాగటి నక్కులు చేస్తారు. వారు, తమ ఈటెలను మొక్కలు కత్తిరించే పరికరాలుగా ప్రయోగిస్తారు. ప్రజలు ప్రజలతో పోరాటం మానివేస్తారు. ప్రజలు యుద్ధానికి మళ్లీ ఎన్నడూ శిక్షిణ పొందరు.
మీరు మీ ప్రజలను విడిచిపెట్టేశారు కనుక నేను మీతో దీనిని చెబుతున్నాను. తూర్పు దేశాల తప్పుడు అభిప్రాయాలతో మీ ప్రజలు నిండి పోయారు. ఫిలిష్తీయుల్లాగే మీ ప్రజలు జ్యోతిష్యం చెప్పటానికి ప్రయత్నించారు. ఆ వింత అభిప్రాయాలను మీ ప్రజలు పూర్తిగా స్వీకరించారు.
ఇతర స్థలాలకు చెందిన వెండి బంగారాలతో మీ దేశం నిండిపోయింది. అక్కడ చాలా చాలా ఐశ్వర్యాలున్నాయి. మీ దేశం గుర్రాలతో నిండిపోయింది. అక్కడ ఎన్నెన్నో రథాలు ఉన్నాయి.
బండల చాటున, నేల బీటల్లో మనుష్యులు దాక్కొంటారు. యెహోవాను గూర్చి ఆయన మహా ప్రభావం గూర్చి ప్రజలు భయపడ్తారు. ఇదంతా భూమిని గజగజ వణకించుటకు యెహోవా నిలబడినప్పుడు జరుగుతుంది.
ఆ సమయంలో ప్రజలు వారి వెండి, బంగారు విగ్రహాలను పారవేస్తారు. (ప్రజలు పూజించుటకు మనుష్యులే ఆ విగ్రహాలను తయారు చేశారు.) ప్రజలు ఆ విగ్రహాలను నేలమీది కన్నాలలో ఉండే ఎలుకలకు, గబ్బిలాలకు వేస్తారు.
అప్పుడు ప్రజలు బండ సందులలో దాక్కొంటారు. యెహోవాను గూర్చి, ఆయన మహా శక్తిని గూర్చి భయపడి వారు అలా చేస్తారు. భూమిని గజగజ వణికించుటకు యెహోవా నిలబడినప్పుడు ఇది జరుగుతుంది.
మిమ్మల్ని రక్షించుట కోసం ఇతరులను నమ్ముకోవటం మీరు మానివేయాలి. వాళ్లూ మనుష్యులే, మనుష్యులు మరణిస్తారు. అందుచేత వాళ్లు కూడా దేవునిలా బలం గల వాళ్లు అని మీరు తలంచవద్దు.