“ఇశ్రాయేలును నేను స్వస్థపరుస్తాను! ఎఫ్రాయిము యొక్క పాపం గూర్చి ప్రజలు తెలుసుకొంటారు. సమరయ అబద్ధాలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు. ఆ పట్టణంలో వచ్చి పోయే దొంగలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
రొట్టెలు చేయువాడు రొట్టె చేయుటకు పిండి పిసుకుతాడు. అతడు రొట్టెను పెనంమీద వేస్తాడు. రొట్టె పొంగుతున్నప్పుడు అతడు మంట ఎక్కువ చేయడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ రొట్టెలు చేసేవానిలాగ లేరు. ఇశ్రాయేలు ప్రజలు వారి మంటను ఎల్లప్పుడూ ఎక్కువ చేస్తున్నారు.
మా రాజు దినాన, వారు మంటను పెంచుతారు. వారు తాగుడు విందులు చేస్తారు. ద్రాక్షామద్యపు వేడి మూలంగా పెద్దలు రోగులవుతారు. కనుక దేవుణ్ణి ఎగతాళి చేసే ప్రజలతో రాజులు చేతులు కలుపుతారు.
ప్రజలు రహస్య పథకాలు వేస్తారు. వారి హృదయాలు పొయ్యివలె ఉద్రేకముతో మండుతాయి. వారి కోపం రాత్రి అంతా మండుతుంది. మర్నాడు ఉదయం అది బహు వేడిగల నిప్పువలె ఉంటుంది.
ఎఫ్రాయిము గర్వం అతనికి విరోధంగా మాట్లాడుతుంది. ప్రజలకు ఎన్నెన్నో కష్టాలు కలిగాయి. అయినప్పటికీ వారు తమ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లలేదు. ప్రజలు సహాయంకోసం ఆయనవైపు చూడలేదు.
సహాయంకోసం వారు ఆయా దేశాలకు వెళ్తారు. కానీ నేను వారిని వలలో పడవేస్తాను. వారి మీద నేను నా వల విసిరి ఆకాశ పక్షుల్లాగ నేను వారిని కిందికి దించుతాను. వారి ఒడంబడిక [*వారి ఒడంబడిక లేక వాళ్ల సంధి ప్రకటనలు.] విషయంలో నేను వారిని శిక్షిస్తాను.
అది వారికి చెడుగా ఉంటుంది. వారు నన్ను విడిచిపెట్టేశారు. నాకు విధేయులగుటకు వారు నిరాకరించారు. కనుక వారు నాశనం చేయబడతారు. ఆ ప్రజలను నేను రక్షించాను. కానీ వారు నాకు విరోధంగా అబద్ధాలు చెబుతారు.
అవును, వారు హృదయపూర్వకంగా ఎన్నడూ నాకు మొరపెట్టరు. వారు ఇతరుల భూములలో ధాన్యం, కొత్త ద్రాక్షారసం కోసం తరిగేటప్పుడు వారి పడకల మీద పడి ఏడుస్తారు. వారి ఆరాధనలో భాగంగా వారిని వారు కోసుకొంటారు. కానీ వారి హృదయాల్లో వారు నా నుండి తిరిగి పోయారు.
దేవుళ్లుకాని వారివైపు (బయలు దేవత) వారు తిరిగారు. వారు అక్కరకు రాని (వంగని) విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ బలాన్ని గూర్చి అతిశయించారు. కానీ వారు కత్తులతో చంపబడతారు. అప్పుడు ఈజిప్టు ప్రజలు వారిని చూచి నవ్వుతారు. విగ్రహారాధన నాశనానికి దారి తీస్తుంది.