విస్తారమైన పండ్లు ఫలించే ద్రాక్షావల్లిలాంటిది ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు దేవుని దగ్గరనుండి ఎన్నెన్నో లభించాయి. కానీ అతడు ఇంకా ఇంకా ఎక్కువ బలిపీఠాలను బూటకపు దేవుళ్లకు కట్టాడు. అతని భూమి క్రమంగా ఎక్కువగా ఫలించింది. కనుక అతడు బూటకపు దేవుళ్లను గౌరవించుటకు స్థంభాలను నిలిపాడు.
ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మోసం చేయాలని చూశారు కానీ ఇప్పుడు వారు తమ దోషాన్ని అంగీకరించాలి. వారి బలిపీఠాలను యెహోవా విరుగగొడ్తాడు. వారి స్మారక శిలలను ఆయన నాశనం చేస్తాడు.
వారు వాగ్దానాలు చేస్తారు కానీ వారు వట్టి అబద్ధాలు మాత్రమే చేపుతున్నారు. వారి వాగ్దానాలను వారు నిల బెట్టుకోరు. ఇతర దేశాలతో వారు ఒప్పందాలు చేస్తారు. ఆ ఒప్పందాలు దేవునికి ఇష్టం లేదు. ఆ న్యాయ మూర్తులు, దున్నబడిన పొలంలో విషపుకలుపు మొక్కల్లాంటివారు.
ఇశ్రాయేలు పాపంచేసి, ఎత్తయిన స్థలాలు అనేకం నిర్మించింది. ఆవెనులోనున్న ఎత్తయిన స్థలాలు అన్నీ నాశనం చేయబడతాయి. వాటి బలిపీఠాలమీద ముళ్ల కంపులు, పిచ్చిమొక్కలు మొలుస్తాయి. అప్పుడు వారు “మమ్మల్ని కప్పండి!” అని పర్వతాలతోను, “మా మీద పడండి!” అని కొండలతోను చెపుతారు.
“ఎఫ్రాయిము నూర్పిడి కళ్లంలో ధన్యం మీద నడవడానికి ఇష్టపడే శిక్షణగల పెయ్యలాగ ఉన్నాడు. దాని మెడమీద నేను ఒక కాడిని పెడతాను. తాళ్లను నేను ఎఫ్రాయిము మీద ఉంచుతాను. అప్పుడు యూదా దున్నటం మొదలు పెడతాడు. యాకోబు తానే భూమిని చదును చేస్తాడు.”
కనుక మీ సైన్యాలు యుద్ధ ధ్వనులు వింటాయి. మరియు మీ కోటలన్నీ నాశనం చేయబడతాయి. అది షల్మాను బేతర్బేలును నాశనం చేసిన సమయంలాగా ఉంటుంది. ఆ యుద్ధ సమయంలో తల్లులు వారి పిల్లలతో పాటు చంపబడ్డారు.
మీకు కూడ బేతేలు వద్ద అలాగే జరుగుతుంది. ఎందుచేత నంటే, మీరు చాలా దుర్మార్గపు పనులు చేశారు గనుక. ఆ రోజు ప్రారంభమైనప్పుడు ఇశ్రాయేలు రాజు సర్వ నాశనం చేయబడతాడు.