యాకోబు చూడగా ఏశావు రావడం కనబడింది. ఏశావు, అతనితో 400 మంది మనుష్యులు వస్తున్నారు. యాకోబు తన కుటుంబాన్ని నాలుగు గుంపులుగా చేసాడు. లేయా, ఆమె పిల్లలు ఒక గుంపులో ఉన్నారు, రాహేలు, యోసేపు ఒక గుంపులో ఉన్నారు, ఇద్దరు దాసీలు, వారి పిల్లలు మరి రెండు గుంపుల్లో ఉన్నారు.
యాకోబు తానే ఏశావు వస్తున్న వైపు ముందుగా వెళ్లాడు. కనుక ఏశావు దగ్గరకు వచ్చిన మొదటివాడు అతడే. యాకోబు తన అన్న దగ్గరకు నడుస్తూ ఏడు సార్లు నేలమీద సాగిలపడ్డాడు.
ఏశావు చూడగా స్త్రీలు పిల్లలు అతనికి కనబడ్డారు. “నీతో ఉన్న వీళ్లంతా ఎవరు?” అని అతడు అడిగాడు. “దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు వీళ్లంతాను. దేవుడు నాకు మేలు చేసాడు” అంటూ జవాబు చెప్పాడు యాకోబు.
“నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కనబడిన ప్రజలంతా ఎవరు? పైగా ఆ జంతువులన్నీ దేని కోసం?” అని ఏశావు అడిగాడు. దానికి యాకోబు “నీవు నన్ను స్వీకరించాలని చెప్పి అవన్నీ నీకు నా కానుకలు” అని జవాబిచ్చాడు.
యాకోబు అన్నాడు: “అలా కాదు, నేను నిన్ను బతిమలాడుకొంటున్నాను. నీవు నిజంగా నన్ను అంగీకరిస్తుంటే, నీవు నా కానుకలు గూడా అంగికరించాలి. మరలా నేను నీ ముఖం చూడటం నాకెంతో సంతోషంగా ఉంది. దేవుని ముఖము చూసినట్టు ఉంది. నీవు నన్ను అంగీకరించటం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది.
అందుచేత నేను నీకు ఇస్తున్న కానుకలను గూడ స్వీకరించుమని ప్రార్థిస్తున్నా. దేవుడు నాకు ఎంతో మేలు చేసాడు. నాకు కావల్సిన దానికంటే ఎక్కువగా ఉంది.” ఈ విధంగా తన కానుకల్ని తీసుకోమని చెప్పి యాకోబు ఏశావును బతిమలాడాడు. కనుక ఏశావు ఆ కానుకలను స్వీకరించాడు.
కాని యాకోబు అతనితో ఇలా చెప్పాడు: “నా పిల్లలు బలహీనులని నీకు తెలుసు. పైగా నా మందలు, వాటి పిల్లలను గూర్చిన జాగ్రత్త నేను తీసుకోవాలి. ఒక్క రోజునే నేను వాటిని చాలా దూరం నడిపిస్తే అవి చస్తాయి.
అందుచేత నీవు ముందు వెళ్లిపో. నేను మెల్లగా నీ వెనుక వస్తా. పశువులు, మిగిలిన జంతువులు క్షేమంగా ఉండగలిగినంత నిదానంగా నేను నడుస్తాను. మరియు నా పిల్లలు కూడ మరీ అలసిపోకుండా నేను మెల్లగా వస్తాను. శేయీరులో నేను నిన్ను కలుసుకొంటాను.”
అయితే యాకోబు సుక్కోతు వెళ్లాడు. అక్కడ తనకోసం ఒక యిల్లు, తన పశువుల కోసం కొట్టములు కట్టాడు. అందుకే ఆ చోటుకు సుక్కోతు [*సుక్కోతు అనగా తాత్కాలిక “పాకలు.”] అని పేరు.
ఆ తర్వాత, యాకోబు పద్దనరాము నుండి కనానులో ఉన్న షెకెము పట్టణం వరకు తన ప్రయాణాన్ని క్షేమంగా ముగించాడు. ఆ పట్టణానికి సమీపంగా ఒక పొలంలో యాకోబు తన నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు.