Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Ezra Chapters

Ezra 7 Verses

Bible Versions

Books

Ezra Chapters

Ezra 7 Verses

1 ఈ సంఘటనల తర్వత పారసీక రాజు అర్తహషస్త పాలన కాలంలో ఎజ్రా బబులోను నుంచి యెరూషలేముకి వచ్చాడు. ఎజ్రా శెరాయా కొడుకు. శెరాయా అజర్యా కొడుకు, అజర్యా హిల్కీయా కొడుకు,
2 హిల్కీయా షల్లూము కొడుకు. షల్లూము సాదోకు కొడుకు, సాదోకు అహిటూబు కొడుకు,
3 అహిటూబు అమర్యా కొడుకు. అమర్యా అజర్యా కొడుకు. అజర్యా మెరాయోతు కొడుకు.
4 మెరాయోతు జెరహ్యా కొడుకు. జెరహ్యా ఉజ్జీ కొడుకు. ఉజ్జీ బుక్కీ కొడుకు.
5 బుక్కీ అబీషూవ కొడుకు. అబీషూవ ఫీనెహాసు కొడుకు. ఫీనెహాను ఎలియాజరు కొడుకు. ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కొడుకు.
6 బబులోను నుండి యెరూషలేముకు వచ్చిన ఎజ్రా గొప్ప ఉపదేశకుడు . అతనికి మెషే ధర్మశాస్త్రం యెహోవా ద్వారా ఇవ్వబడింది. యెహోవా ఎజ్రాకి తోడుగా వున్నాడు. అందుకని, అర్తహషస్త మహారాజు ఎజ్రా కోరుకున్నదల్లా ఇచ్చాడు.
7 ఎజ్రాతోబాటు అనేక మంది ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చారు. వాళ్లతో యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వార పాలకులు, ఆలయ సేవకులు వున్నారు. ఆ ఇశ్రాయేలీయులు అర్తహషస్త చక్రవర్తి పాలన ఏడవ సంవత్సరంలో యెరూషలేముకి తిరిగి వచ్చారు.
8 అర్తహషస్త చక్రవర్తిగా అయిన ఏడవ సంవత్సరం, అయిదవ నెలలో ఎజ్రా యెరూషలేముకి చేరుకున్నాడు.
9 ఎజ్రా, అతనితో ఒక బృందం మొదటి నెల మొదటి రోజున బబులోను నుంచి బయల్దేరారు. ఎజ్రా యెరూషలేముకి అయిదవ నెల ఒకటవ రోజున చేరుకున్నాడు. యెహోవా దేవుడు అతనికి తోడుగా వున్నాడు.
10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్ర అధ్యయనానికి, దాన్ని అనుసరించేందుకూ తన కాలమంతటినీ ఎంతో శ్రద్ధగా వినియోగించాడు. ఎజ్రా ఇశ్రాయేలీయులకు యెహోవా ఆజ్ఞలనూ, ఆదేశ సూత్రాలనూ బోధించాలని కోరుకున్నాడు. అంతమాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆజ్ఞలను అనుసరించడంలో వారికి తోడ్పడాలని కూడా అతను కోరుకున్నాడు.
11 ఎజ్రా యాజకుడు, ఉపదేశకుడు, యెహోవా ప్రభువు ఆదేశాలను గురించీ, ధర్మశాస్త్ర నిబంధనలను గురించీ అతనికి బాగా తెలుసు.
12 ఎజ్రా ఉపదేశకునికి అర్తహషస్త మహారాజు పంపిన లేఖనకలు: యాజకుడూ, పరలోక దేవుని ధర్మశ్రాస్త ఉపదేశకుడూ అయిన ఎజ్రాకి: అభివందనాలు!
13 ఈ క్రింది ఆజ్ఞ జారీ చేస్తున్నాను, నా సామ్రాజ్యంలో నివసిస్తున్న ఏ వ్వక్తి, యాజకుడు, లేక లేవీయుడు అయినా ఎజ్రాతోబాటు యెరూషలేముకు పోవాలనుకుంటే, అతనలా పోవచ్చు.
14 ఎజ్రా! నా ఏడుగురు మంత్రులూ, నేనూ, నిన్ను పంపిస్తున్నాం. నువ్వు యూదాకి, యెరూషలేముకి వెళ్లాలి. మీ దేవుని ధర్మశాస్త్రాన్ని మీ ప్రజలు ఎలా ఆచరిస్తున్నారో పరిశీలించు, పర్యవేక్షించు. ఆ ధర్మశాస్త్రం నీ దగ్గర వుంది కదా.
15 నా మంత్రులూ, నేనూ ఇశ్రాయేలు దేవునికి వెండి బంగారాలు యిస్తున్నాం. దేవుడు యెరూషలేములో వుంటాడు. నువ్వు నీతో ఈ వెండి, బంగారాలు తీసుకువెళ్లాలి.
16 అంతేకాదు, నువ్వు బబులోను దేశంలోని రాష్ట్రాలన్నింట్లోనూ పర్యటించి, మీ ఇశ్రాయేలు ప్రజలనుంచీ, యాజకుల నుంచీ, లేవీయుల నుంచీ కానుకలు పోగుచెయ్యి. ఆ కానుకలు యెరూషలేములోని ఆలయ నిర్మాణం నిమిత్తం ఉద్దేశింప బడ్డాయి.
17 ఆ సోమ్మును ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను కొనేందుకు వినియోగించు. ఆ బలుల తోబాటు సమర్పించవలసిన ధాన్యార్పణలనూ, పానార్పణలనూ కొను. తర్వాత యెరూషలేములోని మీ దేవుని దేవాలయంలో వాటిని బలి ఇవ్వు.
18 తర్వాత నువ్వూ, నీ సోదర యూదులూ ఇంకా మిగిలిపోయిన వెండి బంగారాలను మీ ఇష్టం వచ్చిన విధంగా వాడు కోవచ్చు. దాన్ని మీ దేవునికి ప్రీతికరమైన పద్ధతిలో ఉపయోగించు.
19 నువ్వు వస్తువులన్నీ యెరూషలేము దేవుని సన్నిధికి తీసుకుపో. ఆ వస్తువులు మి దేవుని ఆరాధన కోసం.
20 మీ దేవుని ఆలయం కోసం అవసరమైన అనేక ఇతర వస్తువులను కూడ మీరు పొందవచ్చు. నీకు అవసరమైన ఏ వస్తువు కోసమైనా సొమ్మును రాజ ఖజానా నుంచి తీసుకో.
21 అర్తహషస్త చక్రవర్తినైన నేను ఈ క్రింది ఆజ్ఞను జారీచేస్తున్నాను: యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలో రాజధనాన్ని పర్యవేక్షిస్తున్న వ్యక్తులందరికీ ఎజ్రా ఏమి కోరుకుంటే, దాన్ని అతనికి ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఎజ్రా యాజకుడు, పరలోక దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే ఉపదేశకుడు. మీరీ పనిని సత్వరం సంపూర్ణంగా చెయ్యండి.
22 మీరు ఎజ్రా 3,400 కిలో గ్రాముల వెండిని, వెయ్యి తూముల గోధుమను, 2,200 లీటర్ల ద్రాక్షారసమును, 2,200 కిలో గ్రాములు ఒలీవ నూనెను అడిగినంత ఉప్పును యివ్వండి.
23 పరలోక దేవుడు ఎజ్రా కోసం ఏమి ఆదేశిస్తే, దాన్ని మీరు ఎజ్రాకి సత్వరం, సంపూర్ణంగా ఇవ్వండి. మీరీ పనులు పరలోక దేవుని ఆలయంకోసం చెయ్యండి. దేవునికి నా సామ్రాజ్యం మీదా, నా కొడుకుల మీదా కోపం రావడం నాకు యిష్టం లేదు.
24 యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు, దేవాలయంలోని యితర పనివాళ్ల దగ్గర పన్నులు వసూలు చేయడం ధర్మశాస్త్ర విరుద్ధమన్న విషయం మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ల పన్నులు, రాజుగారికి నజరానాలు, ఏ విధమైన సుంకపు పన్నులు చెల్లించ నక్కర్లేదు.
25 ఎజ్రా, మీ దేవుని యొద్ద నుంచి నువ్వు పొందిన వివేకాన్ని వినియోగించి పౌర, మతపర న్యాయాధిపతులను ఎంపికచేసే అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను. వాళ్లు యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ న్యాయాధిపతులుగా వ్యవహరిస్తారు. నీ దేవుని ఆజ్ఞలను ఎరిగిన ప్రజలకందరికీ వారు తీర్పుతీరుస్తారు. దేవుని ఆజ్ఞలను గురించి వారు తెలియని వారికి నేర్పాలి.
26 మీ దేవుని ధర్మశాస్త్రాన్నిగాని, చక్రవర్తి శాసనాన్నిగాని ఎవరైనా మన్నించకపోతే, అతను శిక్షించబడాలి. నేరాన్ని బట్టి అతనికి మరణ దండనో లేక దేశాంతరవాస శిక్షో విధించాలి, లేక అతని ఆస్తిని జప్తు చేయాలి, లేక అతన్ని చెరసాలలో పెట్టాలి.
27 యెరూషలేములో పున్న యెహోవా ఆలయానికి ఘనత చేకూర్చాలనే తలంపును రాజు మదిలో నాటిన ప్రభువుకు మా పూర్వీకుల దేవుడైన యోహోవాకు కీర్తి కలుగునుగాక!
28 చక్రవర్తి, ఆయన మంత్రుల, ఇతరేతర ముఖ్యాధికారుల ఎదుట నాపై నిజమైన ప్రేమను పభువు చూపించాడు. దేవుడైన యెహోవా నాతో ఉన్నాడు, అందుకే నేను ధైర్యంగా ఉన్నాను. యెరూషలేముకు నాతో పోయేందుకు నేను ఇశ్రాయేలీయులు నాయకులను సమీకరించాను.

Ezra 7:26 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×