English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Ecclesiastes Chapters

Ecclesiastes 2 Verses

1 నాలో నేను, “నేను సరదాగా గడపాలి. నేను నా శాయశక్తులా సమస్త సుఖాలూ అనుభవించాలి” అనుకున్నాను. కాని, అది కూడా నిష్ప్రయోజనమైన పనే అని గ్రహించాను.
2 (ఎల్లప్పుడు) సరదాగా నవ్వుతూ గడపడం మూర్ఖత్వం. సరదాగా గడిపేయడం ద్వారా కలిగే మేలేమీ లేదు.
3 అందుకని, కడుపునిండా ద్రాక్షారసం తాగుతూ మనస్సును జ్ఞానంతో నింపుదామని అనుకున్నాను. సంతోషంగా వుండాలన్న ప్రయత్నంలో నేనీ మూర్ఖత్వానికి చోటిచ్చాను. తమ స్వల్పకాల జీవితంలో జనానికి ఏది మంచిదో కనుక్కోవాలనుకున్నాను. కఠిన శ్రమ సుఖాన్నిస్తుందా?
4 అప్పుడిక నేను పెద్ద పెద్ద పనులు చెయ్య నారంభించాను. నేను నాకోసం భవనాలు కట్టించాను. ద్రాక్షాతోటలు నాటించాను.
5 తోటలు వేయించాను, ఉద్యానవనాలు నెలకొల్పాను. నేను రకరకాల పండ్ల చెట్లు నాటించాను.
6 నేను నాకోసం నీటి మడుగులు తవ్వించి, వాటిలోని నీటిని పెరుగుతున్న చెట్లకు పోసేందుకు వినియోగించాను.
7 నేను మగ, ఆడ బానిసలను ఖరీదు చేశాను. నా భవనంలోనే కొందరు బానిసలు పుట్టారు. నాకు బోలెడు గొప్ప వస్తువులు ఉన్నాయి. నాకు పశువుల మందలు, గొర్రెల మందలు ఉన్నాయి. యెరూషలేములో ఏ ఒక్కనికన్న నాకు ఎక్కువ వస్తువులు ఉన్నాయి.
8 నేను దండిగా వెండి బంగారాలు కూడబెట్టాను. ఆయా రాజుల, రాజ్యాల సంపదలను కొల్లగొట్టాను. నా ఆస్థానంలో గాయనీ, గాయకులు ఉన్నారు. నేను ఏ ఒకరినైన కోరుకోగలను.
9 నేను బాగా ధనవంతుణ్ణీ, కీర్తిమంతుణ్ణీ అయ్యాను. యెరూషలేములో నా వెనుకటి వారందరికంటె నేను గొప్పవాడినయ్యాను. పోతే, నా జ్ఞానం వివేకం నాకు సహాయం చేశాయి.
10 నేను చూసి, కోరుకున్నదల్లా నేను పొందాను. నేను చేసినవన్నీ నా మనస్సుకి తృప్తిని కలిగించాయి. నేను చేసిన శ్రమ అంతటికీ ప్రతిఫలం నా ఈ ఆనందమే.
11 అయితే, అటు తర్వాత నేను చేసినవాటన్నింటినీ నేనొకసారి సమీక్షించుకున్నాను. నేను పడ్డ శ్రమ అంతటినీ బేరీజు వేసుకున్నాను. అదంతా వృథా శ్రమ అన్న నిర్ణయానికి వచ్చాను! అది గాలిని మూట కట్టుకొనే ప్రయత్నంలాంటిది. [*గాలిని … ప్రయత్నంలాంటిది లేక ‘మనస్సును బాగా వ్యాకులపరచేది, భాదపెట్టేది శుష్కమైనది.’] ఈ జీవితంలో మనం చేసే పనులన్నింటి వల్లా మనం పొందే లాభం ఏమీ లేదు.
12 ఒక రాజు చేయగలినదానికంటె ఎక్కువ మరొక డెవడూ చేయలేడు. నీవీనాడు చేయాలని కోరుకో గలవాటన్నింటినీ ఏదో ఒక రాజు ఎన్నడో చేసేవున్నాడు. [†మరొక డెవడూ … చేసేవున్నాడు. హీబ్రూ భాషలో ఈ వాక్యం ఈ సందర్భంలో అస్పష్టంగా వుంది.] (రాజు చేసేపనులు సైతం కూడా వ్యర్థమేనని నేను గ్రహించాను.) అందుకని జ్ఞానార్జన గురించీ, మూర్ఖపు పనులు, మతిలేని పనులు చేయడం గురించీ నేను మరోసారి ఆలోచించ నారంభించాను.
13 చీకటి కంటే వెలుగు మెరుగైనట్లే, మూర్ఖత్వంకంటె జ్ఞానం మెరుగైనదని నేను గ్రహించాను.
14 అదెలాగంటే: తెలివైనవాడు తానెక్కడికి వెళ్తన్నది గ్రహించేందుకు తన మనస్సును కళ్లలా ఉపయోగించుకుంటాడు. కాగా, ఒక మూర్ఖుడు అంధకారంలో నడుస్తున్న వ్యక్తి వంటివాడు. అయితే, బుద్ధిమంతుడిది, బుద్ధిహీనుడిది కూడా ఒకటే గతి అని నేను గ్రహించాను. (ఇద్దరూ మరణిస్తారు)
15 నాలో నేను ఇలా అనుకున్నాను, “ఒక బుద్ధిహీనుడికి పట్టే గతే నాకూ పడుతుంది. మరి జ్ఞానార్జన కోసం నేనెందుకు అంతగా తంటాలు పడినట్లు?” నేనింకా ఇలా అనుకున్నాను: “జ్ఞానార్జనకూడా ప్రయోజనం లేనిదే.”
16 జ్ఞానవంతుడూ, అజ్ఞానీ ఇద్దరూ మరణిస్తారు! మరి జనం వివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు, అవివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు. భవిష్యత్తులో, వాళ్లు చేసిన పనులన్నింటినీ మరచిపోతారు. కాగా వాస్తవంలో వివేకికీ, అవివేకికీ మధ్య తేడా యేమీ లేదు. జీవితంలో అసలైన ఆనందమంటూ ఉందా?
17 దీనితో నాకు జీవితం పట్ల ద్వేషం కలిగింది. ఈ జీవితంలో అన్నీ వ్యర్థమైనవే, గాలిని మూట కట్టుకొన ప్రయత్నించడం వంటివే అనిపించి, నాకు విచారం కలిగింది.
18 దానితో, నేను వెనక చేసిన గట్టి శ్రమ అంతటినీ ద్వేషించనారంభించాను. నేను గట్టి కృషిచేశాను. అయితే, నా కృషిఫలితాలను నా తర్వాత తరాలవాళ్లు అనుభవిస్తారని గ్రహించాను. నేను వాటిని నాతో తీసుకుపోలేను.
19 నేను వేటికోసం అధ్యయనం చేశానో, వేటి కోసం పాటుపడ్డానో, వాటన్నింటిపైనా మరొకడెవడో అదుపు కలిగివుంటాడు. అతడు వివేకి అవుతాడో, అవివేకి అవుతాడో నాకు తెలియదు. ఇది కూడ తెలివి లేనిది.
20 అందుకని, నేను చేసిన శ్రమ అంతా నాకు విచారమే కలిగించింది.
21 తన వివేకం, జ్ఞానం, నైపుణ్యం వీటన్నింటనీ వినియోగించి ఒకడు బాగా కష్టించి పని చేయవచ్చు. కాని, అతను మరణిస్తాడు, అతని శ్రమ ఫలితాలన్నింటిని ఇతరులు పొందుతారు. వాళ్లు ఏ శ్రమా చెయ్యలేదు. కాని, వాళ్లకి అన్నీ లభ్యమవుతాయి. ఇది నాకు చాలా విచారం కలిగిస్తుంది. ఇది అన్యాయమే కాదు, అర్థరహితం కూడా.
22 ఒక మనిషి ఈ జీవితంలో నానా తంటాలూపడి, ఎంతో శ్రమ చేస్తాడు. చివరికి అతని చేతికి చిక్కేదేమిటి?
23 చచ్చేదాకా అతను అనుభవించేది బాధలు, నిరాశా నిస్పృహలు, చేసేది (గొడ్డు) చాకిరీ. రాత్రి పూటకూడా మనిషి మనస్సు విశ్రాంతికి నోచు కోదు. ఇది కూడా అర్థరహితమైనదే.
24 (24-25) జీవితంలో సుఖాలు అనుభవించేందుకు నాకంటె ఎక్కువగా ప్రయత్నించిన మనషి మరొకడెవడైనా ఉన్నాడా? లేడు! నేను గ్రహించిన దేమిటంటే: మనిషి చెయ్యగలిగిన అత్యుత్తమమైన పని యేమిటంటే, తినడం, తాగడం, తాను చేసి తీరవలసిన పనిని సరదాగా చెయ్యడం. దేవుని ఆదేశం కూడా ఇదేనని నేను గ్రహించాను.
26 మనిషి మంచి చేసి, దేవుణ్ణి సంతృప్తి పరిస్తే, అప్పుడిక దేవుడు ఆ మనిషికి వివేకాన్నీ, జ్ఞానాన్నీ, సుఖసంతోషాలనీ అనుగ్రహిస్తాడు. అయితే, పాపాలు చేసేవాడికి దేవుడు ప్రయాసపడే పని, పోగు చేసే పని, కుప్పలుగా పోసే పని మాత్రమే ఇస్తాడు. దేవుడు చెడ్డవానినుంచి తీసుకొని మంచివానికి ఇస్తాడు. అయితే, ఈ పని అంతా వ్యర్థమైనదిగానూ, గాలిని మూటకట్టుకొనే ప్రయత్నంగానూ కనిపిస్తుంది.
×

Alert

×