“మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటానికి వెళ్లినప్పుడు, మీకుంటె ఎక్కువ గుర్రాలు, రథాలు, మనుష్యులు కనబడితే మీరు వారిని గూర్చి భయపడకూడదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొని వచ్చాడు.
యాజకుడు ఇలా చెప్పాలి, ‘ఇశ్రాయేలు మనుష్యులారా నా మాట వినండి. ఈవేళ మీరు మీ శ్రతువులతో యుద్ధానికి వెళ్తున్నారు. మీ ధైర్యం విడువవద్దు. కలవరపడవద్దు. శత్రువునుగూర్చి భయపడవద్దు.
“లేవీ అధికారులు సైనికులతో ఇలా చెప్పాలి: ‘కొత్త ఇల్లు కట్టుకొని దానిని ఇంకా ప్రతిష్ఠించని వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అలాంటివాడు తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాలి. అతడు యుద్ధంలో చంపబడతాడేమో. అలాంటప్పుడు మరో మనిషి అతని ఇంటిని ప్రతిష్ఠిస్తాడు.
ద్రాక్షాతోటను నాటి, ఇంకా ద్రాక్షాపండ్లు కూర్చు కొననివాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి. ఆ మనిషి యుద్ధంలో మరణిస్తే, అప్పుడు అతని పొలంలోని ఫలాలను మరొకడు అనుభవిస్తాడు.
వివాహం కోసం ప్రధానం జరిగినవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి. యుద్ధంలో అతడు మరణిస్తే, అతనికి ప్రధానం చేయబడిన స్త్రీని మరొకడు వివాహం చేసుకొంటాడు.’
“ఆ లేవీ అధికారులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి. ‘ధైర్యం పోయి, భయపడ్తున్నవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అతడు తిరిగి ఇంటికి వెళ్లాలి. అప్పుడు అతడు మిగిలిన స్తెనికులుకూడా ధెర్యం కోల్పోయెటట్టు చేయకుండా ఉంటాడు.’
హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, మొత్తం ప్రజలందరినీ పూర్తిగా మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించాడు.
ఎందుకంటే అలా చేస్తే, మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయమని వారు మీకు నేర్పించజాలరు. వారు వారి దేవుళ్లను పూజించేటప్పుడు చేసే భయంకర పనులు ఏవీ వారు మీకు నేర్పించరు.
“మీరు ఒక పట్టణం మీద యుద్ధం చేస్తుంటే, చాలా కాలంవరకు మీరు ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేసి ఉండవచ్చు. ఆ పట్టణం చుట్టూ ఉండే ఫలవృక్షాలను మీరు నరికి వేయకూడదు. ఆ చెట్ల ఫలాలు మీరు తినవచ్చును గాని ఆ చెట్లను నరికి వేయకూడదు. ఈ చెట్లు మీ శత్రువులు కాదు, అందుచేత వాటితో యుద్ధం చేయవద్దు.
ఆయితే ఫలాలు ఇవ్వని చెట్లు అని మీకు తెలిసిన వాటిని మీరు నరికివేయ వచ్చును. ఆ పట్టణం మీద యుద్ధం చేయటానికి అవసరమైన ఆయుధాలను తయారు చేసేందుకు ఈ చెట్లను మీరు ఉపయోగించ వచ్చును. ఆ పట్టమం పతనం ఆయ్యేంత వరకు మీరు వాటిని ఉపయోగించవచ్చును.