“ఇశ్రాయేలు దేశంలో లేవీ వంశపువారికి భూమిలో ఎలాంటి వాటా దొరకదు. ఆ ప్రజలు యాజకులు సేవచేస్తారు. నిప్పుమీద వంటచేసి, యెహోవాకు అర్పించబడిన బలులు తింటూ వారు బ్రదుకుతారు. లేవీ వంశపు ప్రజల వాటా అదే.
అప్పుడు ఈ లేవీయుడు తన దేవుడైన యెహోవా పేరుమీద పరిచర్య చేయ వచ్చు. అతడు విధి నిర్వహిస్తున్న తన సోదర లేవీయు లందరిలాగే యెహోవా ప్రత్యేక ఆలయంలో పరిచర్య చేయాలి.
మీ బలిసీఠాల అగ్నిమీద మీ కుమారులను గాని మీ కుమార్తెలను గాని బలి ఇవ్వవద్దు. జ్యోతిష్యం చెప్పేవానితోగాని, మాంత్రికుని దగ్గర గాని, భూతవైద్యుని దగ్గర గాని సోదెచెప్పేవారి దగ్గరగాని మాట్లాడి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని తెలిసి కొనేందుకు ప్రయత్నించవద్దు.
ఎవరినీ యితరుల మీద మంత్ర ప్రభావంతో బంధించనీయవద్దు. మీ మధ్య ఎవ్వరూ కర్ణపిశాచము అడిగేవారుగా గాని, సోదె చెప్పే వాడుగాగాని, ఉండకూడదు. ఎవ్వరూ చనిపోయినవారితో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు.
“మీరు ఆ ఇతర జనాంగాలను మీ దేశంలోనుండి వెళ్లగొట్టాలి. ఆ జనాంగాలు సోదెగాండ్ర మరియు శకునాలు చెప్పువారి మాంత్రికుల మాటలు వింటారు. అయితే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అలాంటి పనులు చేయనియ్యడు.
మీ దేవుడైన యెహోవా మీ దగ్గరకు ఒక ప్రవక్తను [*ప్రవక్త దేవునిచేత పిలవబడిన ప్రత్యేక సేవకుడు దేవుడు కలల ద్వారా మరియు దర్శనాల ద్యారా ప్రవక్తలతో మాట్లాడేవాడు. తద్వారా ప్రజలకు సందేశాలను ప్రవక్తలు తెలిపేవారు.] పంపిస్తాడు. ఈ ప్రవక్త మీ స్వంత ప్రజల్లోనుండి వస్తాడు. అతడు నాలాగే ఉంటాడు. మీరు ఈ ప్రవక్త మాట వినాలి.
దేవుడే మీకు ఈ ప్రవక్తను పంపిస్తాడు, ఎందుకంటే మీరు ఆయనను అడిగింది అదే. మీరు హోరేబు (సినాయి) కొండ దగ్గర సమావేశమైనప్పుడు దేవుని స్వరం విని, కోండమీద మహా అగ్నిని చూచి మీరు భయపడ్డారు. అందుచేత ‘మా దేవుడైన యెహోవా స్వరం మరోసారి మమ్మల్ని విననీయవద్దు. ఆ మహా గొప్ప అగ్నినిమాకు కనబడనీయవద్దు, మేము చస్తాము’ అని మీరు అన్నారు.
నీవంటి ఒక ప్రవక్తను నేను వారికోసం పంపిస్తాను. ఈ ప్రవక్త వారి స్వంత ప్రజల్లో ఒకడే. అతడు చెప్పాల్సిన విషయాలను నేను అతనికి చెబుతాను. నేను ఆజ్ఞాపించేవి అన్నీ అతడు ప్రజలకు చెబుతాడు.
ఈ ప్రవక్త నా పక్షంగా మాట్లాడతాడు అతడు నా పక్షంగా మాట్లాడినప్పుడు, ఏ వ్యక్తి అయినా సరే నా ఆజ్ఞలు వినటానికి నిరాకరిస్తే, ఆ వ్యక్తిని నేను శిక్షిస్తాను.’ బూటకపు ప్రవక్తలను తెలుసుకోవటం ఎలా?
“అయితే ఒక ప్రవక్త చెప్పాల్సిందిగా నేను చెప్పని దానిని చెప్పవచ్చు. అతడు నా పక్షంగా మాట్లాడుతున్నానని ప్రజలతో చప్పవచ్చును. ఇలా జరిగితే ఆ ప్రవక్త చంపబడాల్సిందే. లేక ఇతర దేవుళ్ల పక్షంగా ఒక ప్రవక్త మాట్లాడవచ్చు. ఆ ప్రవక్త కూడా చంపబడాల్సిందే.
ప్రవక్త యెహోవా పక్షంగా మాట్లాడుతున్నానని చెప్పినప్పుడు, ఆ విషయం జరగకపోతే, అది యెహోవా చెప్పింది కాదు అని అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఈ ప్రవక్త తన స్వంత ఆలోచనలనే చెబుతున్నాడని మీకు తెలుస్తుంది. అతని గూర్చి మీరు భయపడాల్సిన పనిలేదు.