“కొత్త దేశంలో మీరు మీ జీవితకాలమంతా పాటించేందుకు జాగ్రత్త పడాల్సిన ఆజ్ఞలు, నియమాలు ఉన్నాయి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు జీవించినంత కాలమూ ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి.
ఇప్పుడు అక్కడ నివసిస్తున్న రాజ్యాలనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఈ దేశాల ప్రజలు వీరి దేవుళ్లను పూజించిన స్థలాలన్నింటినీ మీరు పూర్తిగా నాశనం చేయాలి. ఎత్తయిన పర్వతాలమీద, కొండలమీద, పచ్చని చెట్ల క్రింద ఈ స్థలాలు ఉన్నాయి.
వారి బలిపీఠాలను మీరు పడగొట్టాలి, వారి స్మారక శిలలను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాలి. వారి అషేరా స్తంభాలను కాల్చివేయాలి, మీరు వారి దేవుళ్ల విగ్రహాలను కూలగొట్టండి.
మీ దేవుడైన యెహోవా తన ఆలయం కోసం ఒక ప్రత్యేక స్థలం మీ వంశాలవారి మధ్య నిర్ణయిస్తాడు. యెహోవా తన నామాన్ని అక్కడుంచుతాడు. అది ఆయన ఆలయం ఆయనను ఆరాధించడానికి ఆ స్థలానికి వెళ్లాలి
మీ దహనబలులు, మీ బలులు మీ పంట. మరియు జంతువులో దశమ భాగం [*దశం భాగం లేక పదింట ఒక భాగం. ద్వితీయోపదేశకాండము 14:22-29 చూడండి.] మీ ప్రత్యేక కానుకలు, యెహోవాకు మీరు వాగ్దానం చేసిన కానుకలు, మీ స్వేచ్ఛార్పణలు, మరియు మీ పశువుల మందలోను, గొర్రెల మందలోను మొట్టమొదటగా పుట్టిన జంతువులను అక్కడికి మీరు తీసుకొని రావాలి.
మీరూ, మీ కుటుంబాలూ ఆ చోట సమావేశమై అక్కడ అందరూ కలిసి భోజనం చేయాలి, మీ దేవుడైన యెహోవా అక్కడ మీతో ఉంటాడు. అక్కడ మీరు కష్టపడిన వాటి ఫలాలను భుజిస్తారు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఆ మంచివాటిని మీకు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకొంటారు.
ఆయితే మీరు యొర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ఆ దేశంలో నివసిస్తారు. అక్కడ మీ శత్రువులు అందరినుండి యెహోవా మీకు విశ్రాంతి ఇస్తాడు. మరియు మీరు క్షేమంగా జీవిస్తారు.
అప్పుడు యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఉండేందుకు ఒక స్థలం ఏర్పాటు చేసుకొంటాడు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు ఆ చోటికి తీసుకొని రావాలి. మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగాలు, మీ ప్రత్యేక కానుకలు, మీరు యెహోవాకు వాగ్దానం చేసిన కానుకలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదటగా పుట్టిన జంతువులు అన్నింటినీ మీరు తీసుకొని రావాలి.
మీ పిల్లలు, మీ పనిమనుషులు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులుమీ మనుష్యులందరినీ వెంట తీసుకొని ఆ స్థలానికి రండి. ( ఆ లేవియులకు దేశంలో వారి స్వంత భాగం ఉండదు.) అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలసి సంతోషంగా సమయం గడపండి.
మీ వంశాలకు చెందిన ఒక ప్రాంతంలో యెహోవా తన ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకొంటాడు. దహన బలులు అర్పించటం, నేను మీతో చెప్పిన యితర పనులు అన్నీ అక్కడే చేయండి.
“మీరు నివసించే ఏ స్థలంలోనైనా ఎర్ర జింక, చిన్న దుప్పిలాంటి ఏ మంచి జంతువునైనా మీరు చంపి తినవచ్చును. మీరు కొరినంత మాంసం, మీ దేవుడైన యెహోవా మీకు యిచ్చినంత మీరు తినవచ్చును. పవిత్రంగా ఉన్నవాళ్లు, అపవిత్రంగా ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఈ మాంసం తినవచ్చును.
“మీరు నివసించే స్థలాల్లో మీరు తినకూడనివి కొన్ని ఉన్నాయి. అవి ఏవనగా:దేవునికి చేందిన ధాన్యం, దేవునికి చెందిన మీ కొత్త ద్రాక్షారసం, నూనె భాగాలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదటగా పుట్టినవి, మీరు దేవునికి వాగ్దానం చేసిన ఏ కానుకగాని, ఏ స్వేచ్చార్పణలుగాని, లేక దేవునికి చెందిన ఏ కానుకలేగాని,
మీ దేవుడైన యెహోవా నిర్ణయించే ప్రత్యేక స్థలంలో, మీ దేవుడైన యెహోవా మీతో ఉన్న ఆ స్థలంలో మాత్రమే అర్పణలను మీరు తినాలి. మీరు అక్కడికి వెళ్లి, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ పని మనుష్యులందరు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులతో కలిసి మీరు భోజనం చేయాలి. అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలసి సంతోషంగా సమయం గడపండి. మీరు కష్టపడి సంపాదించిన వాటితో ఆనందించండి.
(20-21) “మీ దేశాన్ని విస్తృతపరుస్తానని మీ దేవుడైన యెహోవా వాగ్దానం చేసాడు. ఆయన అలా చేసినప్పుడు, ఆయన తన ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పరచుకొనే స్థలానికి మీ నివాసం చాలా దూరం కావచ్చు. అది చాలా దూరమై, మాంసం కోసం మీరు ఆకలిగా ఉంటే, అప్పుడు మీ దగ్గర ఉన్న ఏ మాంసమైనా తినవచ్చును. యెహోవా మీకు ఇచ్చిన పశువుల మందలోనుండిగాని, గొర్రెల మందలోనుండిగాని, ఏ జంతువునైనా చంపుకోవచ్చును. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం యిది చేయండి. మీరు నివసించే చోట మీకు యిష్టం వచ్చినప్పుడు ఈ మాంసం తినవచ్చును.
మీరు మీ దహన బలులను ఆ స్థలంలో అర్పించాలి. మీ దహనబలుల రక్తం, మాంసం మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించండి. మీ యితర బలుల విషయంలో రక్తాన్ని మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించండి. అప్పుడు ఆ మాంసం మీరు తినవచ్చును.
నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నింటికీ జాగ్రత్తగా విధేయులు కావాలి. మంచివి, సరైనవి మీ దేవుడైన యెహోవాను ఆనందపర్చే పనులు మీరు చేసినప్పుడు మీకూ, మీ సంతతివారికి శాశ్వతంగా మేలు కలుగుతుంది.
“ఇతర రాజ్యాల ప్రాంతంలోనికి మీరు వెళ్లినప్పుడు ఆ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టి నాశనం చేస్తాడు. మీరు లోనికి వెళ్లి వారినుండి ఆ దేశం తీసుకొంటారు. వారి దేశంలో మీరు నివసిస్తారు.
ఆయితే అది జరిగిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఆ రాజ్యాలవారు పూజించిన దేవుళ్లను గూర్చి తెలుసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు. వారు వారి దేవుళ్లను ఎలా పూజిస్తారో అది మీరు నేర్చుకొనేందుకు ప్రయత్నించవద్దు. వాళ్లు పూజించినట్టు పూజించాలనే ఆలోచన కూడా చేయవద్దు.
ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దెవుడైన యెహోవాను ఆరాధించకూడదు. ఎందుకంటే వారు వారి పూజలో యెహోవాకు అసహ్యమైన చెడ్డపనులు అన్నీ చేస్తారు. చివరికి వారు వారి చిన్న బిడ్డలను కూడ వారి దేవుళ్లకు బలి అర్పణగా కాల్చివేస్తారు.