యెహోవా మరోసారి ఇశ్రాయేలీయుల పట్ల కోపం చెందాడు. యెహోవా దావీదును ఇశ్రాయేలీయులకు వ్యతిరేకమయ్యేలా చేశాడు. యెహోవా దావీదుతో, “వెళ్లు, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించు” అని అన్నాడు.
దావీదు రాజు సైన్యాధక్షుడైన యోవాబును పిలిచి, “దాను నుండి బెయేర్షెబా వరకు తిరిగి ఇశ్రాయేలీయుల వంశాల వారందరినీ లెక్కించు. దానివల్ల వారెంత మంది వున్నారో నాకు తెలుస్తుంది,” అని అన్నాడు.
కాని యోవాబు రాజైన దావీదుతో ఇలా అన్నాడు, “ఇప్పటి జనాభా ఎంతైనా వుండనీ; నీ ప్రభువైన దేవుడు అంతకు వంద రెట్లు ప్రజలను నీకు యిచ్చుగాక! ఇది జరుగగా నీవు చూడాలని కాంక్షిస్తున్నాను. అయినా ఈ పని నీవెందుకు తల పెట్టావు?”
రాజు అది విని యోవాబును, సైన్యాధికారులను జనాభా లెక్కలు తీయమని తీవ్రంగా ఆజ్ఞాపించాడు. దానితో యోవాబు, సైన్యాధికారులు ఇశ్రాయేలులో జనాభా లెక్కలు తీయటానికి రాజును విడిచి వెళ్లారు.
వారు యోర్దాను నదిదాటారు. అరోయేరు వద్ద గుడారాలు వేశారు. వారి గుడారాలు లోయలోని నగరానికి కుడిప్రక్కగా వున్నవి. (నగరం గాదులోయ మధ్యలో వుంది. యాజేరుకు వెళ్లే మార్గంలోనే నగరంవుంది)
జనాభా లెక్కలు చూసినందుకు దావీదు సిగ్గుపడ్డాడు. దావీదు యెహోవాకి ఇలా విన్నవించుకున్నాడు, “నేను చేసిన ఈ పనివల్ల నేను చాలా పాపం మూటగట్టుకున్నాను. ప్రభూవా, నా పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.”
గాదుకు యెహోవా ఇలా చెప్పాడు: “దావీదు వద్దకు వెళ్లి నా మాటగా ఈ విషయం చెప్పు: యెహోవా మూడు విషయాలు నీ ముందు వుంచుతున్నాడు. ఆయన నీకు చేయవలసిన దాని నొకటి నీవు ఎన్నుకో.”
దావీదుతో గాదు ఇలా చెప్పాడు: “నేను చెప్పేవాటిలో ఒక దానిని కోరుకో: ఏడేండ్ల కరువు నీకూ, నీ రాజ్యానికీ రావాలా, లేక నీ శత్రువులు నిన్ను మూడు నెలల పాటు వెన్నంటి తరమాలా, లేక మూడు రోజుల పాటు నీ దేశంలో వ్యాధులు ప్రబలాలా బాగా ఆలోచన చేసి ఈ మూడింటిలో నీవు దేనిని కోరుకుంటున్నావో చెప్పు. నేను నీ నిర్ణయాన్ని నన్ను పంపిన యెహోవాకి అందజేయాలి.”
గాదుతో దావీదు, “నిజంగా నేను చాలా క్లిష్ట పరిస్థితిలో పడ్డాను! యెహోవా దయామయుడు కావున ఆయన్నే మమ్మల్ని శిక్షించనీ, నాకు శిక్ష ప్రజలనుండి మాత్రం రానీయకు!” అని అన్నాడు.
అందువల్ల యెహోవా ఇశ్రాయేలులో వ్యాధులు ప్రబలేలా చేశాడు. ఉదయం మొదలైన వ్యాధులు నిర్ణయించిన గడువు వరకు ప్రబలినాయి. ఉత్తర దేశంలో దానునుండి దక్షిణ ఇశ్రాయేలులోని బెయేర్షెబా వరకు డెబ్బై వేల మంది చనిపోయారు.
దేవదూత యెరూషలేమును నాశనం చేసేందుకు చేయి పైకి లేపాడు. కాని జరిగిన విషాద సంఘటనలకు యెహోవా విచారించాడు. ప్రజలను నాశనం చేసిన దేవదూతతో యెహోవా, “ఇది చాలు! నీ చేయిదించు!” అని అన్నాడు. యోహోవాదూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం [*అరౌనా యొక్క కళ్లం దిన వృత్తాంతము మొదటి గ్రంథం 21:15లో “ఒర్నాను” కళ్లంవద్ద అని ఉన్నది.] వద్దవున్నాడు.
ప్రజలను నశింపజేసిన దేవదూతను దావీదు చూశాడు. దావీదు యెహోవాకి యిలా విన్నవించుకున్నాడు, “నేను పాపం చేశాను! నేను తప్పు చేశాను! కాని నా ప్రజలంతా నన్ను గొర్రెలవలె అనుసరించారు! వారు చేసిన తప్పేమీ లేదు! కావున దయచేసి నీ కోపం నామీద, నా తండ్రి కుటుంబం మీద మాత్రమే చూపించు!”
“నా ప్రభువైన రాజు నావద్దకు ఎందుకు వచ్చినట్లు?” అని అడిగాడు అరౌనా. అందుకు దావీదు, “నీనుండి నూర్పిడి కళ్లం కొనడానికి. అది కొని దానిపై యెహోవాకు ఒక బలిపీఠం నిర్మిస్తాను, అప్పడు ఈ వ్యాధులన్నీ అరికట్ట బడతాయి,” అని అన్నాడు.
“నా ప్రభువైన రాజు బలికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దహనబలికి కొన్ని ఎద్దులున్నాయి. అగ్నిని ప్రజ్వలింప చేయటానికి గింజలు రాలగొట్టే బల్లలు, మరియు ఎద్దులపై వేసే కాడికర్రలు వున్నాయి!
అప్పుడు అరౌనాతో రాజు ఇలా అన్నాడు: “కాదు! నేను నిజం చెప్తున్నాను. నీకు వెలయిచ్చి నీ నుండి ఈ భూమినికొంటాను. నాకు వెల లేకుండా వచ్చిన వాటితో నా ప్రభువైన దేవునికి దహనబలులు ఇవ్వను!” కావున నూర్పిడి కళ్లాన్ని, ఎద్దులను, ఏభైతులాల వెండి వెల ఇచ్చి దావీదు కొన్నాడు.
తరువాత యెహోవాకి అక్కడ ఒక బలిపీఠాన్ని దావీదు నిర్మింప జేశాడు. దహనబలులు, సమాధాన బలులు దావీదు అర్పించాడు. దేశంకొరకు దావీదు చేసిన ప్రార్థనను యెహోవా ఆలకించి, ఇశ్రాయేలులో ప్రబలిన వ్యాధులను ఇంకా వ్యాపించకుండా ఆపాడు.