దావీదు తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించాడు. తరువాత దావీదు వారిని బయలుదేరదీశాడు. మూడోవంతు సైన్యాన్ని యోవాబు నడిపించాడు. యోవాబు సోదరుడైన సెరూయా కుమారుడగు అబీషై రెండవ గుంపును, గాతువాడైన ఇత్తయి మూడవ దళాన్ని నడిపించారు. “నేను కూడ మీతో వస్తాను” అని రాజైన దావీదు ఆ జనంతో అన్నాడు.
కాని ప్రజలు వద్దన్నారు. “వద్దు! నీవు మాతో రాకూడదు! మేము గనుక యుద్ధరంగం నుండి పారిపోతే, అబ్షాలోము మనుష్యులు ఏమీ లెక్క చేయరు. మాలో సగం మంది చనిపోయినా వారు పట్టించుకోరు. కాని నీవు మాలాంటి పదివేల మందికి సమానం. కావున నీవు నగరంలోనే వుండటం మంచిది. మాకు సహాయం కావలసి వచ్చినప్పుడు నీవు మాకు సహాయపడవచ్చు” అని అన్నారు.
“సరే, మీరు ఏది మంచిదని తలిస్తే నేనది చేస్తాను” అని రాజు ప్రజలతో అన్నాడు. తరువాత రాజు నగర ద్వారం పక్కన నిలబడ్డాడు. సైన్యం బయటికి వెళ్లింది. వారంతా వందేసి, వెయ్యేసి మంది జట్లుగా బయటికి వెళ్లారు.
యోవాబు, అబీషై మరియు ఇత్తయికి రాజు, “నాకొరకు ఈ పని చేయండి. యువకుడైన అబ్షాలోము పట్ల ఉదారంగా ప్రవర్తించండి!” అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యాధిపతులకు రాజు యిచ్చిన ఆజ్ఞలను ఆ ప్రజలంతా విన్నారు.
అబ్షాలోము దావీదు సేవకులను కలవటం జరిగింది. అబ్షాలోము తప్పించుకు పోవటానికి ఒక కంచరగాడిదను ఎక్కాడు. ఆ కంచర గాడిద పెద్ద సింధూర వృక్షం కొమ్మల క్రిందుగా వెళ్లింది. కొమ్మలు చిక్కగా అల్లుకొని ఉన్నాయి. అబ్షాలోము తల ఆ కొమ్మల్లో చిక్కుకు పోయింది. తన కంచర గాడిద తన క్రిందనుంచి పారిపోయింది. ఆ విధంగా అబ్షాలోము భూమికి పైగా [*భూమికి పైగా “భూమికి ఆకాశానికి మధ్యగా” అని శబ్దార్థం.] వేలాడుచున్నాడు.
యెవాబుతో అతడిలా అన్నాడు: “నీవు వెయ్యితులముల వెండి ఇచ్చినా నేను రాజకుమారుడిని గాయపర్చేవాడినికాను. ఎందుకనగా, రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి యిచ్చిన ఆజ్ఞ మేమంతా విన్నాము. ‘చిన్నవాడైన అబ్షాలోమును గాయపర్చకుండా ఉదారంగా ప్రవర్తించండి’ అని రాజు అన్నాడు.
“ఈ విధంగా నేను ఇక్కడ నీతో కాలం వృధాచేయను” అని యోవాబు అన్నాడు. అబ్షాలోము ఇంకా చెట్టుకు వేలాడుచూ బతికేవున్నాడు. యోవాబు మూడు ఈటెలను తీసుకున్నాడు. ఆ ఈటెలను అబ్షాలోము మీదికి విసిరాడు. ఆ ఈటెలు అబ్షాలోము గుండెను చీల్చుకుంటూ దూసుకు పోయాయి.
యోవాబు మనుష్యులు అబ్షాలోము శవాన్నీ తీసి అరణ్యంలో ఒక పెద్ద గోతిలో పడవేశారు. ఆ పెద్ద గోతిని రాళ్లు వేసి పూడ్చి వేశారు. అబ్షాలోము అనుచరులైన ఇశ్రాయేలీయులంతా భయపడి ఇండ్లకు పారిపోయారు.
అబ్షాలోము బ్రతికివున్న రోజుల్లో రాజు లోయలో, ఒక స్తంభం నిర్మించాడు. అప్పుడు అబ్షాలోము ఇలా అన్నాడు: “నా పేరు చిరస్థాయిగా నిలవటానికి నాకు కుమారుడు లేడు” అందువల్ల ఆ స్తంభానికి తన పేరే పెట్టుకున్నాడు. ఆ స్తంభం ఈనాటికీ “అబ్షాలోము జ్ఞాపక చిహ్నం” అని పిలవబడుతూవుంది.
సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “నన్ను పరుగున పోయి ఈ వార్తను రాజైన దావీదుకు చెప్పనీయండి. నీ కొరకు శత్రువును యెహోవా నాశనం చేశాడు” అని చెపుతానన్నాడు.
అహిమయస్సుతో యోవాబు ఇలా అన్నాడు: “వద్దు, దావీదుకు ఈ రోజు ఈ వార్తను తీసుకొని పోవటానికి వీలులేదు. ఇంకొక రోజు ఈ వార్తను చేర వేయవచ్చు. అంతేగాని ఈ రోజు మాత్రం వద్దు. ఎందుకంటావా? రాజు యొక్క కుమారుడు చనిపోయాడు గనుక.”
తరువాత కూషీయుడైన ఒకనిని యోవాబు పిలిచి, “అతను చూసిన విషయాలన్నీ రాజు వద్దకు వెళ్లి చెప్పమన్నాడు.” కూషీయుడు యోవాబుకు నమస్కరించాడు. తరువాత కూషీయుడు దావీదుకు వార్త చెప్పటానికి పరుగెత్తాడు.
కాని సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “ఏమి జరిగినా పరవాలేదు. నన్ను కూడా కూషీయుని వెనుక పరుగెత్తుకు వెళ్లనీయండి!” అని ప్రాధేయపడ్డాడు. “కుమారుడా! నీవెందుకు వార్త మోసుకొని పోవాలనుకుంటున్నావు? నీవు తీసుకొని వెళ్లిన ఈ వార్తకు నీకు ఏ బహుమానమూ లభించదు!” అని యోవాబు అన్నాడు.
“ఏమి జరిగినా పరవాలేదు; నేను వేగంగా వెళతాను,” అన్నాడు అహిమయస్సు. “అయితే పరుగెత్తు!” అన్నాడు యోవాబు అహిమ యస్సుతో. అప్పుడు యొర్దానులో యగుండా అహిమయస్సు పరుగెత్తాడు. అతడు కూషీయుని దాటి వెళ్లాడు.
ఈ విషయం చెప్పటానికి కావలివాడు రాజును పిలిచాడు. “ఒక్కడే గనుక వస్తూవుంటే, వాడు ఏదో వార్త తెస్తూవున్నాడన్నమాట!” అని దావీదు రాజు అన్నాడు. ఆ వ్యక్తి క్రమేపీ నగరాన్ని సమీపించాడు.
కావాలివాడు ఇంకొక వ్యక్తి రావటం కూడా చూశాడు. పైనున్న కావలివాడు ద్వారపాలకుని పిలిచి, “చూడు! ఇంకొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు!” అని చెప్పాడు. “అయితే వాడు కూడా వార్త తెస్తున్నాడు!” అని అన్నాడు రాజు.
“మొదటి వ్యక్తి సాదోకు కుమారుడైన అహిమయస్సులా పరుగెత్తుతున్నాడని నేను అనుకుంటున్నాను” అని కావాలివాడన్నాడు. “అహిమయస్సు మంచి వ్యక్తి. అతడేదో మంచి వార్త తెస్తూవుండవచ్చు!” అని రాజు అన్నాడు.
అహిమయస్సు రాజును పిలిచి, “అంతా బాగున్నది!” అన్నాడు. అహిమయస్సు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు. “నీ ప్రభుమైన దేవునికి స్తోత్రము. నా ఏలినవాడవైన రాజుకు వ్యతిరేకంగా వున్న వారిని యెహోవా ఓడించాడు,” అని అహిమయస్సుచెప్పాడు.
“యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని రాజు అడిగాడు. “యోవాబు నన్ను పంపినపుడు అక్కడ పెద్ద కోలాహలం నేను చూశాను. కాని అది ఎందుకో నాకు తెలియదు” అని అహిమయస్సు సమాధానమిచ్చాడు.
“యువకుడైన అబ్షాలోము క్షేమంగా వున్నాడా?” అని రాజు కూషీయుని అడిగాడు. “నీ శత్రువులు, నిన్ను గాయపర్చాలని నీకు వ్యతిరేకంగా వచ్చే ఇతర మనుష్యులు ఆ యువకునిలా (అబ్షాలోము) అయిపోతారని నేను అనుకుంటున్నాను” అని కూషీయుడు చెప్పాడు.
దానితో అబ్షాలోము చనిపోయాడని రాజుకు అర్థమయింది. రాజు మిక్కిలి కలతపడిపోయాడు. నగర ద్వారం మీద వున్న గది వద్దకు వెళ్లాడు. అక్కడ బాగా విలపించాడు. గదిలోకి వెళ్లాడు. గదిలోకి పోతూ, “నా కుమారుడా, అబ్షాలోమా! నా కుమారుడా, అబ్షాలోమా! నీ బదులు నేను చనిపోయి వుండవలసింది. ఓ అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా!” అని దుఃఖించాడు.