భూలోక నివాసులమైన మనము నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనము నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు.
ఎందుకంటే మనమంతా క్రీస్తు సింహాసనం ముందు నిలబడవలసి వస్తుంది. అప్పుడు, ఈ శరీరంలో మనముండగా చేసిన మంచికి, చెడుకు తగిన విధంగా ప్రతి ఒక్కడూ ప్రతిఫలం పొందుతాడు.
కనుక ప్రభువుకు భయపడుట అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. కనుక ఆయన సందేశాన్ని అంగీకరించుమని ఇతరులను కూడా ఒత్తిడి చేస్తాము. మా గురించి దేవునికి బాగా తెలుసు. మీ హృదయాలకు కూడా ఈ విషయం తెలుసునని నా విశ్వాసం.
మా గురించి మేము చెప్పుకోవాలని లేదు. మా విషయంలో గర్వించటానికి మీకు అవకాశం యిస్తున్నాము. అప్పుడు మీరు మనిషి గుణాన్ని కాక, అతని వేషం చూసి పొగిడే వాళ్ళకు, సమాధానం చెప్పగలుగుతారు.
ఇక నుండి మేము ఎవ్వరినీ లౌకికంగా పరిగణించము. ఒకప్పుడు మనం క్రీస్తును లౌకికంగా పరిగణించాము, గాని ఇప్పుడు అలా కాదు. ఆయన్ని గురించి మా అభిప్రాయం మారిపోయింది.
క్రీస్తు ద్వారా దేవుడు అందరినీ తన మిత్రులుగా చేసుకొనుచున్నాడన్నదే మా సందేశం. దేవుడు ప్రజలు చేసిన పాపాలను క్షమిస్తాడు. వాళ్ళను తన మిత్రులుగా ఏ విధంగా చేసుకొంటాడన్న సందేశం చెప్పాడు.