మేము యిదివరలో కష్టాలు అనుభవించిన విషయము, ఫిలిప్పీలో అవమానాలు భరించిన విషయము మీకు తెలుసు. మాకు అనేక ఆటంకాలు కలిగినా మేము మా దేవుని సహాయంతో యేసు సువార్తను మీకు బోధించటానికి ధైర్యం చేసాము.
క్రీస్తు అపొస్తలులముగా మేము మా భారం మీపై మోపగల్గినా అలా చేయలేదు. తల్లి తన పిల్లల్ని చూసుకొన్నట్టు మిమ్మల్ని చూసుకొని మీ పట్ల దయతో ఉండినాము. [*మీ పట్ల … ఉండినాము మీ మధ్య పిల్లలవలె ఉండినాము అని కొన్ని ప్రతులలో వ్రాయబడివుంది.]
సోదరులారా! మా శ్రమ, కష్టము మీకు తప్పక జ్ఞాపకం ఉండి ఉండవచ్చును. మేము దేవుని సువార్తను మీకు ప్రకటించినప్పుడు మేము మీకు భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు పని చేసాము.
మీకు ఆధ్యాత్మిక శక్తినిస్తూ, మిమ్మల్ని ఓదారుస్తూ, తన రాజ్యంలోకి ఆహ్వానించి, తన మహిమలో మీకు భాగం యిచ్చే దేవుని మెప్పు పొందేటట్లు మిమ్మల్ని జీవించుమని చెప్పాము.
దైవసందేశాన్ని మీరు మా నుండి విని దాన్ని మానవుల సందేశంలా కాకుండా, దైవసందేశంలా అంగీకరించారు. ఇలా జరిగినందుకు మేము దేవునికి సర్వదా కృతజ్ఞులము. అది నిజంగా దైవసందేశము. అది భక్తులైన మీలో పని చేస్తోంది.
సోదరులారా! యేసు క్రీస్తులో ఐక్యత పొందిన యూదయలోని దేవుని సంఘాలవలే మీరు కూడా కష్టాలు అనుభవించారు. యూదుల వల్ల ఆ సంఘాలు అనుభవించిన కష్టాలే మీరు మీ ప్రజలవల్ల అనుభవించారు.
రక్షణ కలిగించే సందేశాన్ని యూదులుకాని వాళ్ళకు చెప్పనీయకుండా మమ్మల్ని అడ్డగించారు. ఈ విధంగా చేసి తమ పాపాలను అంతులేకుండా పెంచుకొంటూ పోయారు. చివరకు దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చింది.
సోదరులారా! కొద్దికాలం మేము మీ నుండి దూరంగా ఉండవలసి వచ్చింది. మా శరీరాలు మాత్రమే మీ నుండి దూరంగా ఉన్నాయి. కాని మా మనసులు కాదు. మిమ్మల్ని చూడాలని మా మనస్సుల్లో చాలా ఉంది. కనుక మేము ఎన్నో విధాల ప్రయత్నించాము.