యెహోవా దావీదును ప్రేమించాడు. అందువల్ల అబీయాముకు యెరూషలేములో ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అతనికి ఒక కుమారుని కూడ కలుగజేశాడు. యెహోవా ఇంకా యెరూషలేమును సురక్షితంగా వుండేలా చేశాడు. ఇదంతా యెహోవా దావీదు కొరకు చేశాడు.
యెహోవా కోరిన ప్రకారం దావీదు అన్నీ సవ్యమైన పనులు చేశాడు. యెహోవా ఆజ్ఞలను సదాపాటించాడు. హిత్తీయుడైన ఊరియా పట్ల తను చేసిన పాపం ఒక్కటి తప్ప, దావీదు యెహోవాకు సదా విధేయుడైయున్నాడు.
ఆ రోజులలో కూడా లైంగిక వాంఛలకై తమ శరీరాలను ఆరాధనా స్థలాలలో అమ్ముకుని చిల్లర దేవుళ్లను పూజించే పురుషులున్నారు. అటువంటి పురుషగాములను ఆసా దేశంనుండి వెళ్ళగొట్టాడు. మరియు ఆసా తన పూర్వికులు తయారు చేసిన విగ్రహాలన్నిటినీ తీసి వేశాడు.
తన తల్లి మయకాను రాణి పదవి నుంచి ఆసా తొలగించాడు. కారణ మేమంటే మయకా ఒక హేయమైన అషేరా దేవతా విగ్రహాన్ని తయారు చేయించింది. ఈ భయంకర విగ్రహాన్ని ముక్కలు చేసి ఆసా వాటిని కిద్రోనులోయలో తగులబెట్టాడు.
ఆసా తండ్రి కొన్ని వస్తువులను యెహోవాకు సమర్పించాడు. ఆసా కూడ కొన్ని కానుకలను యెహోవాకు సమర్పించాడు. వారు బంగారం, వెండి, తదితర వస్తు సామగ్రిని కానుకలుగా సమర్పించారు. అవన్నీ ఆసా దేవాలయంలో వుంచాడు.
దేవాలయం ఖజానా నుండి, రాజభవనం నుండి ఆసా వెండి, బంగారాలను తీశాడు. అతని సేవకులకు వాటినిచ్చి అరాము రాజైన బెన్హదదుకు పంపాడు. (బెన్హదదు తండ్రి పేరు టబ్రిమ్మోను, టబ్రిమ్మోను తండ్రిపేరు హెజ్యోను) అతడు దమస్కు నగరంలో వుంటున్నాడు.
అతనికి ఆసా ఇలా వర్తమానం పంపాడు, “నా తండ్రికి, నీ తండ్రికి మధ్య ఒక శాంతి ఒడంబడిక జరిగింది. ఇప్పుడు నీతో నేను కూడ శాంతి ఒడంబడిక నొకదానిని చేసుకోదలిచాను. నీకు వెండి బంగారాలు కానుకలుగా పంపుతున్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు బయెషా నా రాజ్యం వదిలిపోతాడు.”
రాజైన బెన్హదదు ఆసా రాజు కోరిన దానికి ఒప్పుకున్నాడు. కావున ఇశ్రాయేలు పట్టణాలమీదికి తన సైన్యాలను పంపాడు. ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు పట్టణాలను ఓడించాడు. కిన్నెరెతు, నఫ్తాలీలను అతడు పూర్తిగా ఓడించాడు.
అప్పుడు రాజైన ఆసా యూదా ప్రజలందరి సహకారాన్ని కోరుతూ ఒక అభ్యర్థన చేశాడు. వారంతా బయెషా రామా నగరాన్ని పటిష్ఠం చేయటానికి వినియోగిస్తున్న రాళ్లను, కలపను తీసుకొనిపోయారు. వాటిని బెన్యామీనీయుల నగరమైన గెబకు, మరియు మిస్పాకు చేరవేశారు. రాజైన ఆసా ఆ రెండు నగరాలను పటిష్టంగా పునర్నిర్మించాడు.
ఆసా చేసిన ఇతరమైన అన్ని పనులు, అతని బలం, అతను నిర్మించిన నగరాల విషయం యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆసా ముసలివాడైనప్పుడు, అతని పాదాలలో జబ్బు ఏర్పడింది.
బయెషా అహీయా కుమారుడు. వారు ఇశ్శాఖారు వంశస్థులు. రాజైన నాదాబును చంపి వేయటానికి బయెషా పధకం వేశాడు. అది నాదాబు, ఇశ్రాయేలు వారంతా కలిసి గిబ్బెతోను నగరంపై దాడి జరుపుతున్న సమయం. గిబ్బెతోను ఫిలిష్తీయుల నగరం. అక్కడ నాదాబును బయెషా హత్య చేశాడు.
బయెషా రాజైన పిమ్మట అతడు యరొబాము కుటుంబాన్ని హతమార్చాడు. యరొబాము కుటుంబంలో ఒక్కడిని కూడా బయెషా ప్రాణంతో వదలలేదు. యెహోవా ఎలా జరుగుతుందని సెలవిచ్చాడో, అదే రీతిలో ఇదంతా జరిగింది. షిలోహులో తన సేవకుడైన అహీయా ద్వారా యెహోవా ఇది పలికాడు.
ఇదంతా ఎందుకు జరిగినదనగా రాజైన యరొబాము చాలా పాపకార్యాలు చేశాడు. అంతే కాకుండా, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. హేయమైన తన పనులతో యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కల్గించాడు.
కాని బయెషా యెహోవాకు వ్యతిరేకంగా అనేక దుష్టకార్యాలు చేశాడు. యరొబాము చేసిన పాపాలే ఇతడు కూడ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి యరొబాము కారకుడయ్యాడు.