బిడ్డలారా! మీరు పాపం చెయ్యకూడదని మీకు లేఖను వ్రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, మన పక్షాన తండ్రితో మాట్లాడేందుకు న్యాయవాది అయిన యేసు క్రీస్తు ఉన్నాడు.
అయినా, ఆ ఆజ్ఞను ఒక క్రొత్త ఆజ్ఞగా మీ కోసం వ్రాస్తున్నాను. దాని సత్యం అందరిలో కనిపిస్తోంది. చీకటి గతిస్తోంది. నిజమైన వెలుగు ప్రకాశించటం మొదలు పెట్టింది.
కాని సోదరుణ్ణి ద్వేషించేవాడు అంధకారంలోనే ఉండిపోతాడు. అంటే, ఆ అంధకారంలోనే తిరుగుతూ ఉంటాడన్న మాట. చీకటి అతణ్ణి గ్రుడ్డివానిగా చేసాయి కాబట్టి తానెక్కడికి వెళ్తున్నది అతనికే తెలియదు.
బిడ్డలారా! తండ్రిని మీరెరుగుదురు. అందుకే మీకు వ్రాస్తున్నాను. వృద్ధులారా! మొదటి నుండి ఉన్నవాణ్ణి మీరెరుగుదురు. అందుకే మీకు వ్రాస్తున్నాను! యువకులారా! మీలో బలం ఉంది. దేవుని సందేశం మీలో జీవిస్తోంది. మీరు సైతానును గెలిచారు. అందుకే మీకు వ్రాస్తున్నాను.
శారీరక వాంఛలు, కళ్ళలోని దురాశలు, ఒకడు చేసేదాన్ని బట్టి, కలిగియున్న దాన్ని బట్టి కలిగే గర్వం. ఇవి తండ్రికి సంబంధించినవి కావు. ఇవి ప్రపంచానికి సంబంధించినవి.
బిడ్డలారా! ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి రానున్నాడని మీరు విన్నారు. ఇప్పటికే క్రీస్తు విరోధులు చాలా మంది వచ్చారు. తద్వారా యిది చివరి గడియ అని తెలిసింది.
క్రీస్తు విరోధులు మననుండి విడిపొయ్యారు. నిజానికి, వాళ్ళు మనవాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళైనట్లయితే మనతోనే ఉండిపొయ్యేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళలో ఎవ్వరూ మనవాళ్ళు కారని తెలుపుతోంది.
ఇక మీ విషయం అంటారా? దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. దానివల్ల కలిగిన ఫలం మీలో ఉంది. మీకెవ్వరూ బోధించవలసిన అవసరం లేదు. ఆ అభిషేకం వల్ల మీలో జ్ఞానం కలుగుతుంది. దేవుడు మీకు నిజంగా అభిషేకమిచ్చాడు. అది అసత్యం కాదు. ఆయన బోధించిన విధంగా ఆయనలో నివసించండి.