కావున దావీదు యోవాబను, ఇతర ప్రజా నాయకులను పిలిచి ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కపెట్టి ఎంతమంది వున్నారో చెప్పమన్నాడు. “దేశంలో బెయేర్షెబా నుండి దాను పట్టణం వరకు ప్రతి ఒక్కరినీ లెక్కపెట్టి నాకు చెప్పండి. అప్పుడు దేశ జనాభా వివరాలు నాకు తెలుస్తాయి” అని అన్నాడు.
కాని యోవాబు ఇలా సమాధానమిచ్చాడు: “యెహోవా తన రాజ్యాన్ని వందరెట్లు అభివృద్ధి చేయుగాక! నా ఏలినవాడా, మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నీ సేవకులు. ఈ పని నీవెందుకు చేయదలిచావు? దీనివల్ల నీవు ఇశ్రాయేలు ప్రజలందరినీ పాపం చేసిన నేరస్థులుగా చిత్రిస్తున్నావు!”
కాని రాజైన దావీదు మొండివైఖరి దాల్చాడు. రాజు చెప్పినట్లు యోవాబు చేయక తప్పలేదు. అందువల్ల యోవాబు ఇశ్రాయేలు దేశంలో ప్రజలను లెక్కిస్తూ నలుమూలలా తిరిగాడు. తరువాత యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చి
దేశంలో ఎంత జనాభా వున్నదీ దావీదుకు చెప్పాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల యోధులు పదకొండు లక్షల మంది వున్నారు. యూదాలో కత్తి పట్టగల శూరులు నాలుగు లక్షల డెబ్బది వేలమంది వున్నారు.
పిమ్మట దేవునితో దావీదు ఇలా విన్నవించుకున్నాడు: “నేను చాలా తెలివితక్కువ పనిచేశాను. ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయించి నేను ఒక మహాపాపం చేశాను. ఇప్పుడు నీ సేవకుడనైన నా తప్పు మన్నించి నా పాపాన్ని తొలగించమని వేడుకుంటున్నాను.”
అందుకు ప్రవక్తయగు గాదుతో దావీదు ఇలా అన్నాడు: “నేను ఆపదలో వున్నాను. నాకు శిక్ష విధించటానికి వేరొక మనుష్యుని నిర్ణయం నాకు అక్కరలేదు. యెహోవా దయామయుడు. కావున నన్ను ఎలా శిక్షించాలో యెహోవానే నిర్ణయించనీయండి.”
యెరూషలేమును నాశనం చేయటానికి దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత యెరూషలేమును నాశనం చేయ మొదలు పెట్టనప్పుడు యెహోవా చూసి బాధపడ్డాడు. అందువల్ల ఇశ్రాయేలును నాశనం చేయకూడదని ఆయన అనుకున్నాడు. ఇశ్రాయేలును నాశనం చేస్తున్న దేవదూతతో యెహోవా. “అది చాలు! ఆపివేయి” అని అన్నాడు. యెహోవాదూత యెబూసీ యుడగు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్ద నిలబడివున్నాడు.
దావీదు తలఎత్తి చూడగా యెహోవాదూత ఆకాశంలో కన్పించాడు. దేవదూత తన ఖడ్గాన్ని యెరూషలేము పైకి చాపివున్నాడు. అప్పుడు దావీదు, తదితర పెద్దలు సాష్టాంగ నమస్కారం చేశారు. దావీదు, ఇతర పెద్దలు తమ సంతాపాన్ని తెలియజేసే ప్రత్యేక దుస్తులు ధరించారు.
దావీదు యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు: “పాపం చేసిన వాణ్ణి నేను! జనాభా లెక్కలు తీయమని నేనే ఆజ్ఞాపించాను! నేను పొరపాటు చేశాను! కాని ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమి నేరం చేశారు? నా దేవుడైన యెహోవా, నన్ను, నా కుటుంబాన్ని శిక్షించుము! నీ ప్రజలను నాశనం చేస్తున్న మహావ్యాధులను అరికట్టుము!”
దావీదు ఒర్నానుతో, “నీ నూర్పిడి కళ్లాన్ని నాకివ్వు. ఈ స్థలంలో యెహోవాని ఆరాధించటానికి నేనొక బలిపీఠాన్ని నిర్మిస్తాను. ఈ కళ్లాన్ని పూర్తి ధరకు నాకు అమ్మివేయి. అప్పుడు ఈ భయంకర వ్యాధులు ఆగిపోతాయి” అని చెప్పాడు.
ఒర్నాను దావీదుకు ఇలా సమాధానమిచ్చాడు: “ఈ నూర్పిడి కళ్లాన్ని తీసుకొనండి! నీవు నా ఏలినవాడవైన రాజువు. మీరు కోరిన విధంగా చేయండి. చూడండి, దహన బలులుగా సమర్పించటానికి నేను మీకు పశువులను కూడ ఇస్తాను. పీఠం మీద అగ్ని వెలిగించటానికి మీకు కళ్లంలో వేసే బల్ల చెక్కలను కూడ ఇస్తాను. ధాన్యార్పణను చెల్లించటానికి నేను మీకు గోధుమలు కూడ ఇస్తాను. నేను ఇవన్నీ మీకు ఇస్తాను!”
కాని దావీదు ఒర్నానుతో ఇలా అన్నాడు: “వద్దు నేను పూర్తి వెలయిచ్చే దీనిని కొనాలి. నీకు చెందినదేదీ నేను తీసుకొని యెహోవాకి ఇవ్వను. నాకు ఊరకనే వచ్చిన దానినేదీ నేను యెహోవాకి అర్పణగా చెల్లించను.”