కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సీయోనులోనుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్లును; యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తనమార్గములవిషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.
ఆయన మధ్యవర్తియై అనేక జన ములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చు కత్తులు గాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.
కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్లగొట్టబడినవారిని బలమైన జనముగాను నేను చేతును, యెహోవా సీయోను కొండ యందు ఇప్పటినుండి శాశ్వతకాలమువరకు వారికి రాజుగా ఉండును.
సీయోను కుమారీ, ప్రమాతి స్త్రీవలెనే నీవు వేదనపడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురమువరకు నీవు వెళ్లుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలోనుండి నిన్ను విమోచించును.
సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కు దువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతి ష్టించుదును.