పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది; జనముల వినాశ కుడు బయలుదేరియున్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి యున్నాడు, నీ పట్టణములు పాడై నిర్జనముగానుండును.
అప్పుడు నేనిట్లంటినికటకటా, యెహోవా ప్రభువా, ఖడ్గము హత్యచేయుచుండగా నీవుమీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి.
ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఈలాగు చెప్పబడును అరణ్యమందు చెట్లులేని మెట్టలమీదనుండి వడగాలి నా జనుల కుమార్తెతట్టు విసరుచున్నది; అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు.
నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా?
దానినిబట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి యున్నది, అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాప పడుటలేదు రద్దుచేయుటలేదు.
రౌతులును విలు కాండ్రును చేయు ధ్వని విని పట్టణస్థులందరు పారిపోవు చున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు, ప్రతి పట్టణము నిర్జనమాయెను వాటిలొ నివాసులెవరును లేరు,
దోచుకొన బడినదానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణవస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణ ములు ధరించి కాటుకచేత నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే; నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయ జూచుచున్నారు.
ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్చిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు విన బడుచున్నది.