సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలురాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేముమీదికి యుద్ధమునకువచ్చి అక్కడ నున్న ఆహాజును పట్టణమును ముట్టడివేసిరి గాని అతనిని జయింపలేక పోయిరి.
నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా
రాజైన ఆహాజు అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి, దాని పోలికెను, మచ్చును, దాని పని విధ మంతయును యాజకుడైన ఊరియాకు పంపెను.
కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కుపట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక బలిపీఠమును కట్టించి, రాజైన ఆహాజు దమస్కునుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను.
మరియు యెహోవా సన్నిధి నున్న యిత్తడి బలిపీఠము మందిరము ముంగిటి స్థలమునుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్యనుండి తీయించి, తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను.
అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమనగాఈ పెద్ద బలిపీఠముమీద ఉదయము అర్పించు దహనబలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి,యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను.