ప్రవక్తయైన షెమయా రెహబామునొద్దకును, షీషకునకును భయపడి యెరూష లేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చిమీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.
వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమైయీలాగు సెలవిచ్చెనువారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనముచేయక, షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేముమీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను.
అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలముచేయక, యూదావారు కొంత మట్టుకు మంచితనము ననుసరించుట చూచి తన కోపము అతనిమీదనుండి త్రిప్పుకొనెను.
రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి యేలుబడి చేసెను; రెహబాము ఏలనారంభించినప్పుడు నలుబదియొక సంవత్సరముల యీడుగల వాడై యుండెను; తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మో నీయురాలు.
రెహ బామునకును యరొబామునకును యుద్ధము యెడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడ నిద్రించి దావీదుపట్టణమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను.